వారంలో సీపీఎస్ రద్దు అని ఉద్యమాలు చేసిన జగన్ తీరా సీఎం అయ్యాక నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచారు. సీపీఎస్ గురించి అడిగితే కేసులు పెడుతున్నారు. బైండోవర్లు చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యమంటున్నారు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం అలవోకగా సీపీఎస్‌ను రద్దు చేస్తున్నాయి. రాజస్థాన్ , చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేయగా తాజాగా జార్ఖండ్ కూడా అదే పని చేసింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి ఉద్యోగులు కూడా సీపీఎస్ రద్దు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకున్నారు.
అయితే పెద్ద, చిన్న రాష్ట్రాలు సాహసోపేతంగా సీపీఎస్ రద్దు చేస్తూంటే.. మాట తప్పుతాడు అనే ముద్ర వేస్తున్నప్పటికీ ఏపీలో ఎందుకు అమలు చేయడం లేదన్న చర్చ వస్తోంది. సీపీఎస్ విషయంలో ఇప్పటికే కేంద్రానికి రద్దు చేయబోమని హమీ ఇచ్చి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారని ఇప్పుడు రద్దు చేయాలంటే ఆ అప్పులన్నీ తిరిగి కట్టాల్సి ఉంటుందని ఆ పరిస్థితి లేనందున సీపీఎస్ రద్దు చేయలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. సీపీఎస్ రద్దుకు పైసా అక్కర లేదు. అయితే రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.
సీపీఎస్ రద్దు అనేది జగన్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. వాళ్లను దారుణంగా మోసం చేయడమే కాకుండా అడ్డగోలుగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడేలా చేస్తోంది. అయితే సీపీఎస్ రద్దు అనేది అసాధ్యమేమీ కాదని ఇతర రాష్ట్రాలు నిరూపిస్తున్నాయి. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం హామీ ఇచ్చిన జగనే. అయితే ఆయనే కుదరదని చెబుతూండటం రాజకీయం అవుతోంది.