బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సంపూర్ణ నిషేధం విధించింది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న అన్ని నగరాలలో ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించిది. ఈ నెల 30 వరకు నిషేధం ఉంటుందని.. దీపావళి రోజు కేవలం 2 గంటలు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని తెలిపింది. తన ఆదేశాల అమలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎన్జీటీ స్పష్టం చేసింది. సీఎస్‌లు, డీజీపీలు మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. ఇప్పటికే9 రాష్ట్రాలు బాణాసంచాను నిషేధించాయి. గాలి కాలుష్యం, శబ్ధకాలుష్యం కంటే..కరోనా సమయంలో పొగ కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీంతో పటాసులు పేల్చొద్దని చెబుతున్నాయి. తాజాగా ఎన్జీటీ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. నవంబర్, అక్టోబర్ వచ్చిందంటే…ఢిల్లీలో పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరుతుంది. అయితే ఇప్పుడు క్రాకర్స్‌తో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ క్రాకర్స్‌పై నిషేధం విధించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం… కర్ణాటక, హర్యానా సర్కార్, సిక్కిం, ఒడిశాలు నిషేధం విధించాయి. అటు బీఎమ్సీ కూడా ముంబైలో క్రాకర్స్ పేల్చొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మీపూజ రోజు మాత్రమేగ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.
గాలి కాలుష్యం కారణంగా కోవిడ్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. సూక్ష్మదూళి కణాలు గాలిలో కలిసి ఊపిరితిత్తులోకి చేరుతాయని… దీని వల్ల రక్త కణాలు ఉబ్బే ప్రమాదం ఉందంటున్నారు. కోవిడ్ వచ్చిన వాళ్లే కాదు..కోవిడ్ నుంచి కోలుకున్న వారికీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ఎన్జీటీతీర్పు అమలు చేసేంందుకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.