తామేం చేస్తామో, చేయగలమో సమర్థంగా ప్రజలకు రుచించేలా చెప్పుకోవడం కాదు.. తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన రాజకీయనాయకులను ఎంతగా రుచించేలా తిట్టిపోయగలం అనేదే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారిపోతున్నది. ఎన్నికల ప్రచారం అంటే ప్రత్యర్థుల్ని ఎంత దారుణంగా వీలైతే అంత దారుణంగా తిట్టడమే అనే డెఫినిషన్కు అంతా కట్టుబడిపోతున్నారు. అందుకే.. విధానాలను, వ్యవస్థనుగురించి ప్రచారంలో మాట్లాడే నేతలకు ఇప్పుడు పెద్దగా ఠికానా లేదు. అలాంటి నేతలను ఎవ్వరూ కనీసం తమ వార్డుల్లో ప్రచారానికి రమ్మని కూడా పిలవడం లేదు. ఎదుటి పార్టీలను ఎంత దారుణంగా తిట్టగల నోటిదురుసు ఉన్న వారికే పెద్దపీట వేస్తున్నారు.
ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు తెతెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మహా క్రేజ్ ఉన్న నాయకుడిగా చెలామణీ అవుతున్నారు. ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్‌రెడ్డిని ప్రచారానికి తీసుకువెళ్లడానికి అక్కడి తెదేపా అభ్యర్థులు ఎగబడుతున్నారు.
ఆంధ్రా సెటిలర్లలో ఎంత కాదనుకున్నా.. తెరాస పట్ల ఒక రకమైన వ్యతిరేకత ఉంటుందనేది తెతెదేపా అభ్యర్థుల అంచనా. అధికార పక్షంగా.. తెరాస చెలరేగుతూ ఉన్న సమయంలో.. వారిపట్ల అసంతృప్తి ఉన్న సామాన్య ఆంధ్రా సెటిలర్లు చేయగలిగేది ఏమీ ఉండదు. కనీసం బహిరంగంగా తిట్టడం కూడా వారికి సాధ్యం కాదు. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డి లాంటి నాయకుడు రోడ్డెక్కి చెడామడా తిడుతూ ఉంటే.. కనీసం ప్రజల ఈగో శాటిస్ఫై అవుతుందని… రేవంత్ తిట్లను చూసి.. కేసీఆర్‌ను, ఆయన ఫ్యామిలీని తామే తిట్టినంతగా సంబరపడిపోయి.. ఆంధ్రా సెటిలర్లు తెతెదేపాకు ఓట్లు వేసేస్తారని అభ్యర్థులు అనుకుంటున్నారు.
మరోవైపు ఆంధ్రా సెటిలర్లలో కూడా మెజారిటీ తెరాసకు అనుకూలంగా మారుతూ ఉన్నారు. వారిలో తెరాస పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతూ ఉన్నది అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ సంగతి నిజమైతే.. తెలుగుదేశం వారి ఆపరేషన్ రేవంత్ వ్యూహం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమో.