crazy fellow Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఆది సాయికుమార్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ తన కెరీర్ లో సరైన సినిమాలూ అంటే ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలే వినిపిస్తాయి. ఈ మధ్య కొన్ని ప్రయోగాలు చేసినా అవీ కలసి రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ తన కంఫర్ట్ జోనర్లోకి వెళ్లి ఒక ప్రేమ కథ చేశాడు. అదే ‘క్రేజీ ఫెలో`. మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటారనే పేరు తెచ్చుకున్న కె.కె.రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాత. ఫణి కృష్ణ సిరికి కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమయ్యాడు. మరి ఆది కోరుకున్న హిట్…. ఈ క్రేజీ ఫెలోతో వచ్చిందా ?
అభి (ఆది సాయికుమార్) తుత్తర పాటు మనిషి. చెప్పింది పూర్తిగా వినకుండానే అల్లరి చేస్తుంటాడు. దీంతో కొన్ని కష్టాలు కూడా కొని తెచ్చుకుంటాడు. అభి అన్నయ్య (అనీష్ కురువిల్లా) సిఫార్సుతో అభికి తన కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు కిషోర్ (సప్తగిరి). ఆఫీస్ లో అభికి రమేష్ (నర్రా శ్రీనివాస్ ) పరిచమౌతాడు. రమేష్ సలహా మేరకు ఒక డేటింగ్ యాప్ ఓపెన్ చేసి సూర్యకాంతం డీపీతో వున్న బాలా త్రిపుర సుందరి (దిగంగన సూర్యవంశి) అనే ప్రొఫైల్ ని లైక్ చేస్తాడు. బాలా త్రిపుర సుందరి కూడా అభి ప్రొఫైల్ ని లైక్ చేస్తుంది. ఇద్దరు చాటింగ్ తోనే ఘాడంగా ప్రేమలో పడతారు. బాలా త్రిపుర సుందరిని చిన్ని అనే ముద్దుపేరు పెట్టుకుంటాడు అభి. ఇద్దరూ ఒక కాఫీ షాప్ లో కలవాలని అనుకుంటారు. ముందుగా వచ్చిన అభి.. చిన్ని కోసం ఎదురుచూస్తుంటాడు. చిన్ని వస్తుంది. చిన్నిని చూసిన అభి ఎగిరిగంతేసి ఆమెను ఎత్తుకొని ‘ఐ లవ్ యూ’ అని చెప్తాడు. కానీ అసలు సంగతి ఏమిటంటే.. అభి ‘ఐ లవ్ యూ’ చెప్పిన చిన్ని (మిర్నా మీనన్) వేరు, ఛాటింగ్ చేసి ప్రేమించిన చిన్ని వేరు. ఇంతకీ ఈ చిన్ని ఎవరు ? అభి తొందర పాటు ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టింది. చాట్ చేసి ప్రేమించిన చిన్నిని అభి కలిశాడా ? తన ప్రేమని చెప్పగలిగాడా ? అనేది మిగతా కథ.
ప్రేమ కథని చెప్పడం అంత తేలిక కాదు. ఇప్పటికే కొన్ని వేల ప్రేమకథలు వచ్చాయి. ఇందులో కొత్తదనం చూపించడం ఒక పెద్ద సవాల్. అందుకే దర్శకులు కొత్తకొత్త టెక్నిక్ లని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ కూడా ఒక ప్రేమ కథని `తొందరపాటు` క్యారెక్టరైజేషన్ తో ఫన్ ఫుల్ గా ప్రజంట్ చేయాలని ప్రయత్నించాడు. ఇందులో ప్రేమ కథ విషయానికి వస్తే.. ముఖాలు చూసుకోకుండా కేవలం ఛాటింగులతోనే నడిచే ట్రాక్. అది సవ్యంగా నడుస్తున్న సమయంలో హీరో తుత్తర కారణంగా కథలో ఒక సంఘర్షణ. వీటి మధ్య ఐదు పాటలు, మూడు ఫైట్లు. ఈ సెటప్ అంతా బావున్నప్పటికీ దర్శకుడు చేసిన ప్రయత్నం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఈ కథకి దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ లో ఫన్ వుంటుంది కానీ మరీ పగలబడి నవ్వేలా మాత్రం వుండదు. నవ్వు పెదవుల దగ్గరే ఆగిపోతుంది.
హీరో క్యారెక్టర్ ని రెండు సీన్లతో పరిచయం చేయడం బావున్నప్పటికీ ఇందులో అసలు కథ మాత్రం ఆర్గానిక్ గా మొదలవ్వదు. బార్ లో మందు కొడుతున్నపుడు రమేష్ ఇచ్చే సలహాతో డేటింగ్ యాప్ ఓపెన్ చేసి కథకు భీజం వేయడం మరీ సిల్లీగా వుంటుంది. అంతకుముందు సాయి కుమార్ వాయిస్ తో కథని చెప్పినప్పటికీ.. లవ్ ట్రాక్ ని మొదలుపెట్టే పద్దతి మాత్రం కృత్రిమంగా ఉంటుంది. చాటింగ్ తోనే ప్రేమ పుడుతుంది. ”ప్రేమ పుట్టడానికి కారణాలు వుండవు. ఒక్క క్షణం చాలు’ అనే డైలాగులతో ఇలాంటి ప్రేమకథలు నడుస్తాయి కానీ అందులో అంత బలం మాత్రం కనిపించదు. అయితే హీరో క్యారెక్టరైజేషన్, ఆఫీసు సీన్లు, ఇంట్లో వదిన పాత్ర రూపంలో పంచిన హాస్యం డీసెంట్ గానే ఇంటర్వెల్ వరకూ తీసుకెళ్తుంది.
విరామంలో ఇచ్చిన ట్విస్ట్ మరీ అంత ఎక్సయిటింగా వుండదు. అయితే విరామం తర్వాత ఈ కథలో అసలు సమస్య మొదలౌతుంది. ఎప్పుడైతే వేరే చిన్ని , అభి జీవితంలోకి వచ్చిందో అక్కడే కథ గాడి తప్పింది. రెండో చిన్ని పాత్రని మరీ నోట్లో నాలుక లేనట్లు చూపించడం ఆకట్టుకోదు. ఇక్కడే డ్రామాని నడపలేని అపరిపక్వత దర్శకుడిలో కొట్టించినట్లు కనిపించింది. పైగా సదరు తుత్తర పాటు హీరో సెకండ్ హాఫ్ లో మతిమరుపు మనిషిలా గతం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తాడు. ప్రేమించిన అమ్మాయి ఇంట్లో పది రోజులు వుంటే కనీసం ఆమె దగ్గరికి వెళ్లి.. డేటింగ్ యాప్ లో అంత ప్రేమ కురిపించి ఇప్పుడు ఎందుకు కనీసం ప్రేమగా పలకరించడం లేదని అడగడు సరికదా.. కనీసం ఆమె కళ్ళలో చూసి ప్రేమగా ఒక మాట చెప్పడు. అలా చెబితే.. అసలు చిన్ని నేను కాదని ఆమె ఎక్కడ చెప్పేస్తుందోనని భయపడ్డారేమో మరి. రెండో `చిన్ని` ప్రవేశం తర్వాత అసలు చిన్ని మరుగున పడిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్ కానీ తెరపైకి రాదు. కన్ ఫ్యూజన్ డ్రామాలో ప్రధాన పాత్రలని ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చి డ్రామాని రక్తికట్టించాలి. కానీ ఇందులో అది కనిపించకపోవడం ఒక లోపం. పైగా హీరోలోని తొందరపాటుని దర్శకుడు తనకు కావాల్సినప్పుడు వాడుకున్నాడు.. వద్దనుకొన్నప్పుడు వదిలేశాడు. కథ ప్రకారం సహజంగా నడపలేదనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ కథలో `గుండెజారి గల్లంతయ్యిందే` లక్షణాలు పుష్కలంగా కనిపిస్తుంటాయి.
ఆది సాయికుమార్ లుక్ చాలా ఫ్రెష్ గా వుంది. ప్రేమ కావాలి, లవ్లీ నాటి రోజులు గుర్తుకు తెచ్చాడు. తన పాత్రని చాలా హుషారుగా చేశాడు. ఈమధ్య వచ్చిన ఆది సినిమాలకంటే ఇది వంద రెట్లు బెటర్ అనుకోవాలి. ఈ జోనర్లో కథలు ఎంచుకొంటే… ఆది మళ్లీ ట్రాక్ లోకి వస్తాడు. బాల త్రిపుర సుందరి పాటలో డ్యాన్స్ లు ఆకట్టుకుంటాయి. దిగంగన సూర్యవంశి అందంగా వుంది . ఆమె నటన కూడా డీసెంట్ గా వుంది. మిర్నా మీనన్ పాత్రాన్ని ఇంకాస్త శ్రద్దగా తీర్చిదిద్దాల్సింది. వదిన పాత్రలో నటి డబ్బింగ్ కాస్త తేడాగా వున్న ఆ పాత్ర డీసెంట్ గా వుంది. నర్రా శ్రీనివాస్, అనీస్ కురివిల్లా, సప్తగిరి .. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ద్రువన్ పాటలు వినడానికి బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా చక్కగా చేశాడు. దర్శకుడు ఇంకాస్త తెలివిగా డ్రామా రాసుకోవాల్సింది. ‘ఎక్కడ డ్రామా మొదలౌతుందో అక్కడ లాజిక్ ముగుస్తుంది’ అనేది పాపులర్ నానుడి. క్రేజీ ఫెలో సినిమా చూసినప్పుడు కూడా కలుగుతుంది. లాజిక్, ఇంటెలిజెన్స్ ని ప్రేక్షకుడు పక్కన పెట్టేయాలి. అప్పుడే ఈ క్రేజీ ఫెలో నచ్చుతాడు. ఏదేమైనా ఈ మధ్య ఆది చేస్తున్న చిత్రాల కంటే ‘కాస్త బెటర్’ అని ఫీలింగ్ కలిగించిన చిత్రమిది.
తెలుగు360 రేటింగ్: 2.5/5