‘నేనే రాజు – నేనే మంత్రి’ తేజ కెరీర్‌కి కొత్త ఊపిరి పోసింది. తేజ ఇది వరకు చాలా హిట్లు చూసుండొచ్చు. కానీ ఈ హిట్టు మాత్రం – ప్రత్యేకం. తేజ పని అయిపోయిందనుకొన్న సమయంలో – తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో మంచి హిట్టు కొట్టాడు. అదీ.. మూడు సినిమాల పోటీలో. ఆ కాన్ఫిడెన్స్ తేజ లో బాగానే ప్రతిబింబిస్తోంది. మొన్నటి థ్యాంక్స్ మీట్లో.. తేజలో ఇది వరకటి తేజ కనిపించాడు. ‘నేనే రాజు..’కి ముందు నుంచీ పాజిటీవ్ టాకే నడిచింది. తేజ హిట్టు కొట్టడం అని తెలుసుకొన్న చాలామంది నిర్మాతలు అడ్వాన్సులు పుచ్చుకొని తేజ ఆఫీసు ముందు క్యూ కట్టారు. కానీ… తేజ మాత్రం అంత తేలిగ్గా లొంగే రకం కాదు కదా? అందుకే… ఒక్కరి దగ్గర కూడా అడ్వాన్సు తీసుకోలేదు. సినిమా విడుదలై… హిట్టు టాక్ వచ్చినా ఎవ్వరికీ మాట ఇవ్వలేదు.
తేజ ‘యస్’ అంటే కనీసం రెండు మూడు సినిమాలకు సంతకాలు చేసేయొచ్చు.కానీ.. ఈ హిట్టుని కొంతకాలం పదిలంగా కాపాడుకోవాలని చూస్తున్నాడు తేజ. అందుకే.. కథ, స్క్రిప్టు అన్నీ పక్కాగా కుదిరిన తరవాతే.. తదుపరి సినిమా గురించి ఆలోచిస్తానని అంటున్నాడు. ”నాకు హిట్టూ, ఫ్లాపులు కొత్తకాదు. నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తానని వెనక తిరగడం నా వరకూ మామూలే. అయితే ఈసారి ఎవరికీ మాట ఇవ్వదలచుకోలేదు. ఇక నుంచి మంచి సినిమాలే తీయాలి.. హిట్టు సినిమాలే తీయాలి అనుకొంటున్నా. నా మనసుకు నచ్చేంత వరకూ సినిమా మొదలెట్టను” అంటున్నాడు తేజ.