రాజధాని ప్రాధికార సంస్థ (సి.ఆర్.డి.ఏ.) కమీషనర్ శ్రీకాంత్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేరే శాఖకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టరుగా పనిచేస్తున్న చెరుకూరి శ్రీధర్ ని నియమించింది. శ్రీకాంత్ తో బాటు మరి కొందరు ఉన్నతాధికారులని కూడా బదిలీ చేసింది కనుక ఇది రొటీన్ వ్యవహారంగానే పైకి కనబడుతున్నప్పటికీ, అందుకు బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం కోసం ఆయనని ప్రభుత్వం ఏరికోరి సి.ఆర్.డి.ఏ.కమీషనర్ గా నియమించుకొని, వివిధ దేశాలలో అధ్యయనం కోసం కూడా పంపించింది. కానీ ఆయన పనితీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నందునే బదిలీ చేసినట్లు తెలుస్తోంది. లేకుంటే రాజధాని పనులు మొదలయ్యే ముందు ఆయనని బదిలీ చేసి ఉండరు.
తుళ్ళూరు మండలంలో నేలపాడు గ్రామంలోని రైతులని ఒప్పించడానికి గత ఏడెనిమిది నెలలుగా ప్రయత్నిస్తున్నా వారు తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో వారి భూములని స్వాధీనం చేసుకొనేందుకు ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం క్రింద రైతులకి నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారానికి శ్రీకాంత్ బదిలీకి ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆయనని విదేశాలకి పంపించి వివిధ నగరాలని అధ్యయనం చేయించిన తరువాత ఇప్పుడు వేరే శాఖకి బదిలీ చేయడం వలన, ఆయన విదేశీ యాత్రలపై పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోయినట్లే. అదీగాక రాజధాని నిర్మాణం విషయంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, కష్టనష్టాలు, సింగపూర్ తదితర విదేశీ సంస్థలతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినందున వాటి గురించి ఆయనకి మంచి అవగాహన ఏర్పడి ఉండవచ్చు. అటువంటి వ్యక్తిని వేరే శాఖకి పంపించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడం వలన మళ్ళీ ఈ విషయాలన్నిటిపై అవగాహనా ఏర్పరుచుకొనడానికి ఆయనకీ కొంత సమయం పడుతుంది. ఆ కారణంగా పనులు నెమ్మదించవచ్చు. కనుక ఇతర ప్రభుత్వ శాఖలలోలాగ సి.ఆర్.డి.ఏ.లో అధికారులని బదిలీలు చేస్తే ఇటువంటి అనుమానాలు, ఊహాగానాలు కలిగే అవకాశం ఉంటుంది కూడా.