ప్రభుత్వ పెద్దలు పగబడితే ఎలా ఉంటుందో… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తున్నారు. కృష్ణా కరకట్టపై ఆయన ఉంటున్న నివాసాన్ని మూడున్నర నెలలుగా ఏమీ చేయలేకపోవడాన్ని… జీర్ణించుకోలేకపోతున్నట్లుగా ఉంది. అందుకే… మరోసారి నోటీసులు జారీ చేశారు. అది అక్రమ కట్టడం అని తమ పరిశీలనలో తేలిందని.. వారంలోగా… కచ్చితంగా ఖాళీ చేయాలని.. ఇంటి గోడకు నోటీసులు అంటించారు. గతంలో ఇచ్చిన నోటీసుల గురించి కూడా కొత్త నోటీసుల్లో ప్రస్తావించారు. అక్రమం అని నిర్ధారించినందున.. ఇక తర్వాతి ప్రక్రియ కూల్చివేతే. పోలవరం కట్టడం అంటే అంటే… తన ఇంటికి నోటీసులు ఇచ్చినంత ఈజీ కాదని… చంద్రబాబు శుక్రవారం.. మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన గంటల్లోనే… నోటీసులు ఆయన ఇంటికి వేలాడటం… ప్రభుత్వ పెద్దల ఆలోచనా దృక్పథానికి నిదర్శనమని.. టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. ఆయన మొదట లక్ష్యం.. చంద్రబాబు ఇల్లేనన్నట్లుగా మారింది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా… పట్టించుకోని ప్రభుత్వం… చంద్రబాబు ఇంటిపై మాత్రం రోజువారీగా గురి పెట్టింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టిన తర్వాత… చంద్రబాబు ఇంటిపై దృష్టి పెట్టింది. అయితే.. ఒక్క చంద్రబాబు ఇంటినే టార్గెట్ చేస్తే… ప్రజల్లో అనుమానాలొస్తాయని అనుకున్నారేమో కానీ… కరకట్టపై ఉన్న ఇళ్లకు నోటీసులిచ్చారు. తర్వాత సైలెంటయిపోయారు. ఇప్పుడు.. మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్క ఇంటికే నోటీసులు ఇచ్చినట్లుగా సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వారికీ ఇస్తామని అంటున్నాయి.
ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు.. ఉద్దేశపూర్వకంగా నీటిని ఆపి.. చంద్రబాబు ఇంట్లోకి వరద వచ్చేలా కుట్ర చేశారనే ఆరోపణలు బలంగా వచ్చాయి. నీరు ఇంట్లోకి చేరితే.. కూల్చి వేయడానికి గొప్ప అవకాశం దొరుకుతుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం… ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు కరకట్ట ఇంటికి వచ్చి చూసి వెళ్లేవారు. డ్రోన్ తోనూ… దృశ్యాలు చిత్రీకరించారు. కానీ ఇంట్లోకి నీళ్లు రాలేదు. కొన్ని వందల గ్రామాలు అయితే మునిగిపోయాయి. ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవడంతో… ఇప్పుడు… నేరుగా… కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి తీరును బట్టి చూస్తే… అదే జరగబోతోందని చెబుతున్నారు.