అమరావతి నిర్మాణానికి నిధుల కోసం సీఆర్డీఏ అన్ని రాకల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు.. అపార్టుమెంట్లు నిర్మించి… అమ్మాలని చూస్తోంది. దీనికి సంబంధించి అచ్చంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా ఏర్పాట్లు చేసింది. హ్యాపినెస్ట్ తో అపార్టుమెంట్ల సముదాయాన్ని నిర్మించి అమ్మబోతోంది. అమరావతిలోని కీలకమైన ప్రాంతంలో 1200 అపార్టుమెంట్ల సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందు కోసం నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ అపార్టుమెంట్ల బుకింగ్ ను ఆన్ లైన్ లో ప్రారంభించి…తొలి విడతగా మూడు వందల అపార్టుమెంట్లను ఆన్ లైన్ లో బుకింగ్ కు ఉంచబోతున్నారు.
లీవబుల్ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం స్వయంగా సీ.ఆర్.డి.ఎ నే నేలపాడు వద్ద పదిహేను ఎకరాలలో ఈ ప్లాట్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు. చదరపు అడుగు 3, 492 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో మొత్తం 12టవర్లలో 1200ప్లాట్లను నిర్మించనున్నారు. ఒక్కో టవర్ 19 అంతస్తులతో నిర్మాణం కానుంది. నేలపాడు వద్ద కోర్ క్యాపిటల్ లో ఈ నిర్మాణాన్ని చేపడుతున్న సి.ఆర్.డి.ఎ , వంద శాతం వాస్తు, గ్రీనరీ, అన్ని సౌకర్యాలతో స్మార్ట్ అపార్టుమెంట్లను నిర్మించాలని నిర్ణయించింది. హరిత భవనాలుగా నిర్మాణం చేసేందుకు ఐజీ బీసీ ధృవీకరణను కూడా సి.ఆర్.డి.ఎ సొంతం చేసుకుంది. ఏ అంతస్తులో ఎటువైపు ఉన్న ప్లాట్ ను తీసుకోవాలో కూడా ఎంపికకు అవకాశం కల్పిస్తుంది. బుకింగ్ చేసుకునే సమయంలో ఏ ప్లాట్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు త్రిడి గ్రాఫిక్స్ నమూనాను కూడా ఆన్ లైన్ లో ఉంచారు. బర్డ్స్ ఐ వ్యూ పేరిట ప్లాట్ ఎలా ఉంటుందనేది కూడా ఆన్ లైన్ లో ఉంచారు.
ఆన్ లైన్ లో ఉన్న త్రిడీ వీడియోను గృహం కొనుగోలు చేసిన యజమాని తన ప్లాట్ లోకి నడుచుకుంటూ వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించినట్లుగా ఉండే గ్రాఫిక్స్ ను కూడా ఉంచారు. మొత్తం పదకొండు కేటగిరీలలో 1225చదరపు అడుగుల నుంచి 2,750 చదరపు అడుగుల వరకు అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 17వేల మంది ఈ అపార్టుమెంట్ల గురించి సి.ఆర్.డి.ఎ కార్యాలయంలో విచారణ చేశారు. దేశ, విదేశాల నుంచి అత్యధికంగా కాల్స్ వస్తుండటంతో శుక్రవారం ఉదయం మూడు వందల ప్లాట్లను ఆన్ లైన్ లో బుకింగ్ కోసం ఉంచుతున్నారు. ఇందులో యనబై శాతం బుక్ అయితే వెంటనే మరో మూడు వందల ప్లాట్లను కూడా అందుబాటులోకి తీసుకురానుననారు.