తమిళ్ హీరో సూర్య నటించిన ‘వీడోక్కడే’ సినిమా గుర్తుందా? వింత వింత పద్ధతుల్లో డైమండ్స్, డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంటారు. అటువంటి కేసుల్లో ఇదీ ఒకటి. సినిమాలో విదేశాల నుంచి ఇండియాకి తీసుకొస్తారు. ఇక్కడ ఇండియా నుంచి విదేశాలకు స్మగ్లింగ్ చేయబోయి ముంబై పోలీసులకు చిక్కాడు ఓ కర్ణాటక వాసి. స్మగ్లింగ్ చేయడానికి అతను ఎంచుకున్న పధ్ధతి చూసి పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే అతణ్ణి అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే… కర్ణాటకకు చెందిన మహ్మద్ సర్వాన్ అరబ్ దేశమైన ఖతర్‌లోని దోహా నగరానికి వెళ్ళడానికి ముంబై ఎయిర్ పోర్ట్ కి వెళ్లాడు. చెకింగ్ చేసే సమయంలో అతని లగేజీలో రెండు గుమ్మడికాయలు కనిపించాయి. రెండిటి చుట్టూ ప్లాస్టిక్ షీట్స్ టైట్‌గా చుట్టేయడంతో డౌట్ వచ్చింది. దానికి తోడు సాధారణంగా గుమ్మడికాయలు వుండే బరువు కంటే కొంచెం తక్కువ బరువు వున్నాయి. ఏదో తేడాగా వుందని ప్లాస్టిక్ షీట్స్ తొలగించి చూడగా ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనుమానం నిజమైంది. గుమ్మడికాయలో గింజలను తొలగించిన మహ్మద్ సర్వాన్… వాటిలో గంజాయి నింపేశాడు. సుమారు నాలుగున్నర లక్షల గంజాయిని అతడు దోహాకి స్మగ్లింగ్ చేయబోయాడు. అక్కడ గంజాయికి డిమాండ్ ఎక్కువ వుంది. కానీ, తక్కువ దొరుకుతుంది. ఈజీ మనీ కోసం అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడట.