తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. అందులో సందేహం లేదు. ఓ పట్టభద్రుల నియోజకవర్గం, మరో టీచర్ నియోజకవర్గాల్లో గెలిచింది. మరో టీచర్ నియోజకవర్గాన్ని ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ గెల్చుకుంది. బీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పోటీ చేసిన ఒక్క చోట్ల పోరాడి ఓడిపోయింది. ఆ పార్టీలో ఉన్న పరిస్థితులతో గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎవరికి వారే చేసుకునే రాజకీయంగా కాంగ్రెస్ ఇరుక్కుపోయింది. అయితే బీజేపీకి లభించిన విజయాల వెనుక మేమంటే మేము అని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు.
మ్యాన్ ఆఫ్ ది ఎలక్షన్స్ కిషన్ రెడ్డి !
ఇలా ఎన్నికల ఫలితాలు రాగానే కొన్ని మీడియా చానళ్లలో ప్రత్యేకంగా బ్రేకింగులు వచ్చాయి. కిషన్ రెడ్డి ప్రత్యేక వ్యూహం పాటించి.. గెలుపుల వెనుక కీలక పాత్ర పోషించారని ఆ బ్రేకింగ్స్ సారాంశం. చాలా మంది అవునా నిజమా..అనుకున్నారు. ప్రత్యేకంగా కిషన్ రెడ్డికి మైలేజీ ఇచ్చేందుకు ఆ చానళ్లు ప్రయత్నించాయంటే.. అందులోనూ అగ్ర స్థానంలో ఉన్న చానళ్లు.. ఎలాంటి పరపతి వాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సహజంగా క్రెడిట్ ఆయనకే రావాలి కానీ .. రెండు ఎమ్మెల్సీలూ కరీంనగర్ కేంద్రంగా ఉన్న నియోజకవర్గాల్లోనే గెలిచారు. అక్కడే బండి సంజయ్ ముందుకు వస్తున్నారు.
అసలు బండి సంజయే స్టార్ ప్లేయర్
బండి సంజయ్ ది అగ్రెసివ్ పాలిటిక్స్. ఆయన తన భావజాలాన్ని ఎప్పుడూ దాచుకోరు. కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్లేనని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారంటే.. ఆయన తన రాజకీయం విషయంలో ఎంత స్పష్టంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డిని ఖరారు చేసినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ గెలుపు కోసం ప్రయత్నించారు. టీచర్స్ నియోజకవర్గంలోనూ అంతే. ఆయన పనితీరుతో నలభై శాతానికిపైగా ఓట్లు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన ఓట్లతోనే బీజేపీ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ గెల్చుకుంది. అందుకే అసలు స్టార్ ప్లేయర్ బండి సంజయేనని ఆయన వర్గం వాదిస్తోంది.
క్రెడిట్ హైకమాండ్ ఎవరికి ఇస్తుంది ?
తెలంగాణలో సాధించిన విజయాలు బీజేపీకి ఖచ్చితంగా బూస్ట్ ఇచ్చేవే. ఈ ఫలితాలు హైకమాండ్ ను కూడా ఆనందింపచేస్తాయి. త్వరలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ్ని నియమించనున్నారు. ఈ ఫలితాలు ఆ ఎంపికపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ పనితీరును మెచ్చితే ఆయనకే అధ్యక్ష పదవి ఇవ్వొచ్చు. కేంద్ర మంత్రిగా ఉండటం కన్నా బండి సంజయ్ కు రాష్ట్రంలో ఉండటమే ఎక్కువ సంతోషం. అందుకే ఈ ఫలితాల క్రెడిట్ బండి సంజయ్ కు ఇస్తే.. హైకమాండ్ ఆయనకు వీరతాళ్లు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.