దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నదే. ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు ఇదే విషయమై మాట్లాడుతూ ఉంటారు. ఈసారైనా భారతరత్న ఇవ్వాలంటూ ప్రతీయేటా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే వచ్చారు. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చి గౌరవించాలనే డిమాండ్ ని చట్టసభల్లో తీర్మానించి, కేంద్రానికి పంపిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. అంతేకాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఇదే ప్రస్థావన తీసుకొచ్చారు. కేంద్రానికి తన డిమాండ్ వినిపించాయి. అయితే, తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇదే టాపిక్ ను తెరమీదికి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ నాని చేసిన డిమాండ్ పై కేంద్రం స్పందించడం విశేషం. భారతరత్నకు ఎవరి పేర్లు పరిశీలించాలనేది ప్రధాని నిర్ణయిస్తారనీ, నాని పంపిన ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్టు హోం శాఖ ఆయనకు తెలిపింది.
ఇప్పుటికైనా ఈ డిమాండ్ పై భాజపా సర్కారు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా అంటే.. సగం సగం అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే, ప్రస్తుతం కనిపిస్తున్న ఒక సానుకూలాంశం ఏంటంటే… ఆంధ్రాలో భాజపా సొంతంగా ఎదిగే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి వివిధ పథకాల పేరుతో నిధులు వస్తున్నా, వాటి క్రెడిట్ తమకు దక్కడం లేదన్న ఆవేదన ఏపీ భాజపా నేతల్లో మొదట్నుంచీ ఉంది. కేంద్రం నిధులతో జరుగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో కూడా ప్రధాని మోడీ ఫొటో కూడా కనిపించకుండా చేస్తున్నారంటూ ఈ మధ్య భాజపా నేతలు వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే.. ఆ క్రెడిట్ భాజపా సర్కారుకు దక్కుతుందనీ, ఆ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన కొంతమందిలో ఉందని అంటున్నారు.
అయితే, ఇక్కడే ఇంకో సమస్య కూడా ఉంది! కేంద్రం ఇస్తున్న నిధుల్నే తమ ప్రయత్నంగా టీడీపీ చెప్పుకుంటోంది. ఇప్పుడు కేంద్రం ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించినా.. అది తమ ప్రయత్న ఫలితంగానే క్లెయిమ్ చేసుకుంటుంది కదా! టీడీపీ విషయంలో ఈ అనుమానం భాజపాకి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి, ఎన్టీఆర్ కు భారతరత్నను భాజపా ఇస్తుందా అనేదానిపై ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. తమకు ఏమాత్రం క్రెడిట్ దక్కదని అనిపిస్తే ఎలాంటి పనులైనా అధికార పార్టీలు చెయ్యవు! అలాంటి ఓ సంస్కృతి నేటి రాజకీయాల్లో భాగమైపోయింది. కనీసం, ఎన్టీఆర్ కు భారతరత్న అంశంలోనైనా వీటికి అతీతంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే ఆశిద్దాం!