ఓ తల్లి వేసిన తప్పటడుగులు.. బంగారు భవిష్యత్ ఉన్న బిడ్డ ప్రాణానికి నూరేళ్లు తెచ్చి పెట్టాయి. నవమాసాలు కని.. కంటికి రెప్పలా చూసుకుంటున్న బిడ్డ చావును ఆ తల్లి కళ్ల ముందే చూడాల్సి వచ్చింది. అనైతిక బంధాలకు ప్రాధాన్యం ఇచ్చి.. దారి తప్పిన ఆ అమ్మ ఇప్పుడు కడుపుకోతకు గురవుతోంది. తన భార్య ఎంతో అమాయకురాలని.. నమ్మి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్న ఆ భర్త.. గుండె పగిలి ఏడుస్తున్నారు. తన భార్య నమ్మక ద్రోహం చేసిందని మాత్రమే కాదు.. బిడ్డ కూడా.. దక్కకుండా పోయిందని. ఈ క్రైమ్.. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌లో జరిగింది.
మేడ్చల్‌లోని విహారి అపార్ట్మెంట్ దగ్గర గొంతు కోసుకున్న ఓ యువకుడు హల్ చల్ చేస్తున్నాడని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది. పోలీసులు వెళ్లే సరికి ఆ యువకుడు అక్కడే ఉన్నాడు. అతడు చెప్పింది విని లోపలికి వెళ్లి ఫ్లాట్‌లో చూస్తే.. ఐదేళ్ల పాప విగత జీవిగా పడి ఉంది. గొంతు కోసుకున్న ఆ యువకుడి పేరు కరుణాకర్. చనిపోయిన చిన్నారి పేరు ఆద్య. అక్కడే ఫ్లాట్‌లో షాక్‌కు గురైనట్లు ఓ యువతి కూర్చుని ఉంది.. ఆమెకు కూడా.. కాస్త గాయం అయి ఉంది. ఆమె పేరు అనూష. అక్కడే ఇంకో వ్యక్తి ఉన్నాడు.. అతని పేరు రాజశేఖర్. అతనికీ కత్తి గాయం ఉంది. అక్కడి సీన్ చూసి.. పోలీసులకు కాస్త క్లారిటీ వచ్చింది. అదే సమయంలో దారుణానికి పాల్పడిన కరుణాకర్ తాను చెప్పాల్సింది చెప్పాడు.
గ్రామకార్యదర్శిగా పని చేసే కల్యాణ్, అనూష దంపతులు. వారికి ఐదేళ్ల పాప ఉంది. కల్యాణ్ విధులకు వెళ్లిన తర్వాత అనూష సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తుంది. అలా ఆమెకు కరుణాకర్, రాజశేఖర్ అనే ఇద్దరు యువకులు పరిచమయ్యారు. ఇద్దరితోనూ ఒకరికి తెలియకుండా ఒకరితో సాన్నిహిత్యం పెంచుకుంది. భర్త ఆఫీసు పని మీద వెళ్లిన తర్వాత వీరు వచ్చేవారు. అయితే కొన్ని రోజులకు.. కరుణాకర్‌ను దూరం పెట్టి.. రాజశేఖర్‌ను మాత్రమే ఇంటికి రానిస్తోంది. దాంతో కరుణాకర్ అసహనానికి గురయ్యాడు. ఏదో ఒకటి తేల్చుకోవాలని.. కత్తితో అనూష ఇంటికే వచ్చాడు. అప్పటికే రాజశేఖర్ అనూషతో గడుపుతూండటంతో… సహించలేక దాడి చేశాడు. దాంతో రాజశేఖర్ బాత్రూంలో దాక్కున్నాడు. కరుణాకర్.. బిడ్డ గొంతు కోశాడు. తర్వాత అనూషపై దాడి చేశాడు. అరుపులు విని.. రాజశేఖర్ బయటకు వచ్చాడు. ఆయనపైనా కరుణాకర్ దాడి చేశాడు. చివరికి తాను కూడా.. గొంతు కోసుకున్నాడు.
ఈ వ్యవహారంలో అందరూ బాగున్నారు. పాపను చంపి గొంతు కోసుకున్న కరుణాకర్ బాగానే ఉన్నాడు.. అనూష… రాజశేఖర్ కూడా బాగున్నారు. కానీ ఏ పాపం తెలియని పాప మాత్రం ప్రాణాలు కోల్పోయింది. భార్య చేసిన తప్పిదం వల్ల.. కుటుంబాన్ని పోగొట్టుకున్న కల్యాణ్.. నిర్వేదంగా ఉండిపోయాడు. ఓ తల్లి చేసిన తప్పు.. కుటుంబానికి నరక ప్రాయం అయింది.