కులం.. మతం ఏదైనా మన దేశంలో వివాహ బంధానికి ఒక పవిత్ర త ఉంది. వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఒక్కటై కష్టం..సుఖంలో జీవి తాంతం తోడునీడగా ఉంటానని ప్రమా ణం చేసి వివాహం చేస్తుంటారు. కానీ ఈ మహిళ ఈ వివాహ బంధాన్ని ఎగ‘తాళి’ చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వివాహాలు చేసుకుని అత్తింట్లో బంగారం తీసుకుని పరారవుతూ చివరకు పోలీసుల వలలో చిక్కుకుంది. వివరాలిలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనిక ను ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి 3 నెలల క్రితం వివాహం చేశారు. అమ్మాయి బాగుండడంతో ఎలాంటి కట్నం ఇవ్వక పోయినా ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి ఇద్దరూ సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 25న ఆమె తండ్రి అనంతరెడ్డి కుమార్తె వద్దకు వచ్చి తమ కూతురిని పుట్టింటికి తీసుకు పోతున్నట్లు చెప్పి ఆమెను వెంట తీసుకుని బయలు దేరాడు. ఆ తర్వాత వారు పుట్టింటికి వెళ్లలేదు. తిరిగి అత్తగారింటికి రాలేదు. దీంతో కంగారు పడిన మౌనిక భర్త రామకృష్ణారెడ్డి అన్ని చోట్ల విచారించి చివరకు ఫలితం లేకపోవడంతో ఈనెల 9వ తేదీ ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుతో నిజ స్వరూపం వెలుగులోకి..
రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. వారు వాడుతున్న సెల్‌ఫోన్ ఆధారంగా ఎక్కడున్నారన్న విషయం పై పూర్తి నిఘా ఉంచారు. మొదట విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. తరువాత అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లారు. అక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు హైదరాబాద్‌లో ఒక యువకునితో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడకు చేరుకుని ఆ యువకుడితో పాటు మౌనికను అదుపులోకి తీసుకుని ఖాజీపేట స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
ఏకంగా ఏడు వివాహాలు ….
మౌనికను పోలీసులు విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తితో ఈమెకు మొదట వివాహమైంది. వివాహం జరిగిన కొద్ది రోజులకు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో రెండవ వివాహం జరిగింది. మూడవ వివాహం గిద్దలూరు కు చెందిన వ్యక్తితో. నాలుగో వివాహం తెనాలికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఐదవ పెళ్లి, ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన రామకృష్ణారెడ్డితో ఆరవ వివాహాం జరిగింది. ఇతన్ని వదిలేసి వెళ్లిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన యువకుడితో విజయవాడలో పరిచయం కాగా అతన్ని అన్నవరంలో ఏడో వివాహం చేసుకుని వైజాగ్ వెళ్లింది. ఖాజీపేటలో కేసు నమోదు అయినట్లు తెలుసుకుని వైజాగ్ నుంచి ఇద్దరూ కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరిని వివాహం చేసుకోవడం వారితో కొద్ది రోజులో.. లేదా నెలలో సంసారం చేయడం వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించడం ఆమె నైజంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈమె చర్యలకు తండ్రి కూడా సహకరించాడు. మౌనికను ఆరవ పెండ్లి చేసుకున్న ఖాజీపేట ప్రాంతంకు చెందిన భూమిరెడ్డి రామక్రిష్టారెడ్డి ఫిర్యాదుతో అనంతరెడ్డి, మౌనికలతోపాటు..ఏడవ పెండ్లి చేసుకున్న చంటినాయకులను మైదుకూరు రూరల్ సీఐ కంబగిరి రాముడు, ఎస్ఐ రోషన్లు అరెస్ట్ చేశారు.. మౌనికను నిత్య పెండ్లికూతురు అవతారమెత్తిన వైనంను మిడియాకు పోలీసులు వివరించారు.