ఎన్నికల్లో నేరగాళ్లకు ఆస్కారం కల్పించకూడదు అనే విషయంలో ఆదర్శాలను ప్రవచించే స్వచ్ఛంద సంస్థలు అను నిత్యస్త్రం గొంతు చించుకుంటూనే ఉంటారు. ఎన్నికలు లేకుండా, సాధారణ సమయాల్లో ఇలాంటి చర్చలు సాగినప్పుడు ప్రతి రాజకీయ పార్టీకూడా ఆ చర్చల్లో చురుగ్గా పాల్గొంటుంది. నేరమయ రాజకీయాల్ని అంతం చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రవచనాలు వల్లిస్తుంది. అయితే తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి అందరూ అందరే అని నిరూపించుకుంటారు. నేరప్రవృత్తిలో కొమ్ములు తిరిగిన వారిని అక్కున చేర్చుకుని, వారికి అందలం మీద స్థానం కల్పిస్తారు. చట్టసభలకు పంపే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం అన్ని డివిజన్లకు కలిపి బరిలో ఉన్న అభ్యర్థుల్లో 72 మంది నేర చరితులు ఉన్నట్లుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఒక జాబితా విడుదల చేశారు. అయితే 150 డివిజన్లకు జరిగే ఎన్నికల్లో నేరచరితులు 72 మంది అంటే యాభై శాతానికంటె తక్కువే అని సంతోషిస్తున్న వారు కొందరు. నిజానికి 50 శాతం సీట్లు మహిళలకు రిజర్వు కావడం వల్ల.. నేరచరితుల సంఖ్య తక్కువగా ఉన్నదని… లేకుంటే ఇది ఇంకా పెరిగేదనేది ఒక అంచనా. అప్పటికీ.. ఈ జాబితాలో 8 మంది మహిళలు కూడా ఉండడం విశేషం.
పార్టీల వారిగా నేరచరితుల విషయానికి వస్తే.. ఇంచుమించుగా అన్ని పార్టీలూ ఒకే స్థాయిలో వారికి ఆదరణ కల్పిస్తున్నాయని చెప్పాలి. తెరాసలో 14 మంది ఉండగా, తెదేపా కాంగ్రెస్‌లలో 13 మ ంది వంతున నేర చరితులున్నారు. అదే ఎంఐఎం లో 11 మంది ఉన్నారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ సమానంగానే నేరగాళ్లుండడం విశేషం.
రాజకీయాలు నేరగాళ్లకు అడ్డాలుగా మారిపోయాయంటే.. గణాంకాలు ఇలా కనిపిస్తున్నప్పుడు కాదని అనడం ఎలా సాధ్యమవుతుంది. పార్టీలు సాధారణ రోజుల్లో ఒకరకమైన నీతులు ప్రవచిస్తూ.. ఎన్నికల సమయంలో తిరిగి నేరగాళ్ల భుజాల మీదే అధికార పీఠం వైపు వెళ్లాలని అర్రులు చాస్తోంటే.. ఇలాంటి పరిణామాలు కా,. మరెలాంటి పరిణామాలుంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు