సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల గణేష్ అద్దెకు ఉంటున్న తన ఇంటిని ఖాళీ చేయమని కోరుతున్నా పట్టించుకోకపోగా, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.
ఫిలింనగర్ లోని ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని నౌహీరా షేక్ కంప్లైంట్ చేశారు. ఈ విషయమై ఫిబ్రవరి 15నే ఆమె ఫిర్యాదు చేసినా ఫిలింనగర్ పోలీసులు పట్టించుకోకపోవడంతో తాజాగా నౌహీరా షేక్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా అద్దె చెల్లించకపోగా ఇంటిని ఖాళీ చేయాలని కోరినందుకు తనను నిర్బంధించి బెదిరింపులకు దిగాడని ఆరోపించారు.
గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండదండలతో ఇంటిని అక్రమంగా చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని నౌహీరా తెలిపారు. తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేష్ పై ఐపిసి 341,506 సెక్షన్ల కింద ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.