ఈమధ్య ప్రతీ సినిమాలోనూ ఫృద్వీనే. థియేటర్లో వినిపించే ప్రతీ నవ్వూ ఫృద్వీదే. అందుకే ఫృద్వీకి దిష్టి తగిలినట్టుంది. వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మొన్నామధ్య ఓ సినిమాలో బాలయ్యని ఇమిటేట్ చేశాడని ఫ్యాన్స్ హర్టయ్యారు. ఆన్లైన్లో ఫృద్వీతో ఓ ఆటాడుకొన్నారు. దాంతో.. ‘నాకు బాలయ్య అంటే అభిమానం.. నేను ఆయన ఫ్యాన్ ని. ఇంకెప్పుడూ ఆయన్ని ఇమిటేట్ చేయను’ అని చెప్పుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఫృద్వీపై ఏకంగా ఓ 420 కేసు ఫైల్ అయ్యింది. నన్ను మోసం చేశాడంటూ ఓ మహిళ జూబ్లీ హిల్స్ పోలీసుల్ని ఆశ్రయించడం, ఫృద్వీపై కేసు ఫైల్ చేయడం టాలీవుడ్లో కలకలం సృష్టించాయి. ఆ మహిళ ఎవరో కాదు… ఇది వరకు ఫృద్వీ ఇంట్లో పని మనిషి. దాంతో… ఆమె ఫిర్యాదుకు బలం చేకూరింది. ఫృద్వీ రొటీన్‌గానే ‘నాకేం పాపం తెలీదు. నేను అమాయకుడ్ని’ అంటున్నాడు. అక్కడితో ఆగలేదు. నన్ను కావాలని ఇలా ఇరికించాలని చూస్తున్నారు.. అంటూ ఆవేదన వెళ్లగక్కాడు. ఇది వరకే.. ఫృద్వీని కొన్ని బెదిరింపు ఫోన్లు వచ్చాయట. అయినా లెక్క చేయగలేదని, ఇప్పుడు ఆ వ్యవహారం ఇలా ముదురుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు ఫృద్వీ.
‘నన్ను తొక్కేస్తున్నారు’ అనే ఆవేదన ఫృద్వీ మాటల బట్టి బయటపడుతోంది. ఫృద్వీ ఇప్పుడు ఓ రేజింగ్ స్టార్. చడీ చప్పుడూ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ స్టార్ కమెడియన్ అయిపోయాడు. ఇది వరకు కామెడీ చేస్తే బ్రహ్మానందమే చేయాలి అనుకొన్నవాళ్లంతా… ఫృద్వీ ఉంటే ఏదోలా వర్కవుట్ అయిపోతుందే అన్న ధీమా తెచ్చుకొన్నారు. ఫృద్వీ ఎదుగుదల కొంతమంది కమెడియన్ల జోరుకు బ్రేకులు వేసిందన్నది వాస్తవం. చాలామంది పరోక్షంగా ఫృద్వీపై కుళ్లుకుంటున్నారు. ఫృద్వీ రోజురోజుకీ ఒక్కో మెట్టు ఎక్కుతుంటే… ఆ స్థానంలో ఉన్న కమెడియన్లు ధడేలున కింద పడుతున్నారు. వాళ్ల ఉసురు ఫృద్వీని ఇలా చుట్టుకుందేమో? ఒకరు మరొకర్ని తొక్కేసే స్థాయి పరిశ్రమ ఎప్పుడో దాటేసింది. ఒకవేళ అలా ప్రయత్నించినా ఆ ఆనందం తాత్కాలికమే. కమెడియన్ల జోరు ఎప్పుడూ శాశ్వతం కాదు. కృష్ణభగవాన్ నుంచి తాగుబోతు రమేష్ వరకూ.. ఒక్కో సీజన్లో మెరిసి మాయమైపోయినవాళ్లే ఎక్కువ. ఇప్పుడు ఫృద్వీ సీజన్ నడుస్తోంది. అంతే. దానికి ఆడిపోసుకోవడం ఎందుకు? దాన్ని సాకుగా చూపించి చేసిన తప్పు నుంచి ఫృద్వీ కూడా తప్పించుకోలేడు. మనం కళ్లు మూసుకొన్నా.. నిజం, న్యాయం ఎప్పుడూ కళ్లు తెరిచే ఉంటుంది.. ఆ విషయం ఫృద్వీనే కాదు.. అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే.