గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన హైడ్రా వాటిని నేలమట్టం చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే వందలాది భవనాలను నేలమట్టం చేయగా.. మరికొన్ని భవనాలకు నోటీసులు ఇచ్చారు. ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో హైడ్రాకు కొంతమంది అడ్డుతగులుతుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఇటీవల సున్నం చెరువు పరిధిలో ఎఫ్ టీఎల్ లో ఉన్న నివాసాలను హైడ్రా నేలమట్టం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడుతారని అధికారులను ప్రశ్నించారు. ఉన్న ఇళ్ళను కూల్చివేస్తే ఉన్నపళంగా తాము ఎక్కడికి వెళ్ళాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. తన ఇంటిని కూల్చివేస్తే ఒంటిపై పెట్రోల్ పోసుకుంటానంటూ అధికారులను బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ..వారిని అతి కష్టం మీద అక్కడి నుంచి తరలించారు.
హైడ్రా కూల్చివేతల సమయంలో అధికారులను అడ్డుకున్న వారిపై పోలీసులు తాజాగా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేసిన వెంకటేష్ తోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు పెట్టారు. హైడ్రా అధికారుల విధులకు ఆటంకం కల్గించారంటూ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం.
హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ లోనూ మరికొంతమంది అడ్డంకిగా మారుతారని ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.