ప్రజా జీవితంలో ఉన్న నేర చరితుల సంగతి త్వరగా తేల్చాలనుకుంటున్న సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రజా ప్రతినిధుల అంశం విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ.. తెలంగాణ నుండి 118 ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని నివేదిక ఇచ్చారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది. ఒక సిట్టింగ్ ఎంపి పై యావజ్జీవ్ శిక్ష పడే కేసు ఉందని తెలిపారు. బీజేపీ నుండి ఆరుగురు, కాంగ్రెస్ నుండి 12 మంది.. ఎంఐఎం నేతలు ఐదుగురు.. టీఆర్ఎస్ నుండి 28 మందిపై కేసులు ఉన్నాయని నివేదిక సమర్పించారు.
ప్రజా ప్రతినధులపై ఉన్న కేసుల విచారణను ఏడాది లోపు పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఇప్పటికే ఆ కేసులు అలాగే ఉన్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనిపై అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియాను సుప్రీంకోర్టు నియమించింది. ఆయన పెండింగ్లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను రాష్ట్రాల వారీగా సుప్రీంకోర్టుకు సమర్పిస్తున్నారు. తర్వాత ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా విచారణ చేయడానికి సుప్రీంకోర్టు ఓ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం ఉంది కానీ.. తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నవారికి మాత్రం.. ఎలాంటి అడ్డంకులు లేవు. దాంతో చట్టంలో ఉన్న వివిధ రకాల లొసుగులను అడ్డం పెట్టుకుని.. నిందితులు విచారణ జరగకుండా చూసుకుంటున్నాని.. ఏళ్ల తరబడి ఆ కేసులు పేరుకుపోతున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. దీనిపై సుప్రీంకోర్టు ఏడాదిలో విచారణ చేయాలని గతంలో ఆదేశించినా కార్యరూపంలోకి దాల్చలేదు. ఇప్పుడు స్పష్టమైన కార్యాచరణలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభిస్తే.. దేశంలో క్రిమినల్ కేసులున్న నేతలకు గడ్డు కాలమే.