అధికారంలోకి రాగానే తమపై..తమ నేతలపై క్రిమినల్ కేసులను ఎత్తివేసుకునే రాజకీయపార్టీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల్నిహైకోర్టు అనుమతితోనే ఎత్తివేయల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల నేర చరిత్ర అంశంపై దాఖలైన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థిగా ప్రకటించిన 48 గంటల్లోగా అభ్యర్థి నేరచరిత్రను ప్రజలకు తెలియచేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో అధికారంలోకి వస్తున్న రాజకీయ పార్టీలు … ముందూ వెనుకా చూసుకోకుండా తమ పార్టీ నేతలపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేస్తున్నారు. ఇది వివాదాస్పదమవుతోంది.
వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులపై కేసుల ఎత్తివేత వరుసగా సాగుతోంది. చివరికి హత్య కేసుల్ని కూడా ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల్నిరాత్రికి రాత్రి ఎత్తివేయడం వివాదం రేపింది. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతోంది కూడా. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేకాదు ఆ పార్టీకి చెందిన అనేక మంది కీలక నేతలపై కేసులు ఎత్తివేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానుపై ఎత్తేసిన కేసుల వివాదం హైకోర్టుకు కూడా చేరింది. చాలా కేసుల్లో అసలు నిందితుల పేర్లు కూడా చెప్పకుండా… కేసుల్ని ఉపసంహరించుకుంటూ ఆదేశాలిచ్చారు.
ప్రస్తుత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే.. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలపై ఉపసంహరించుకున్న కేసులన్నీ మళ్లీ విచారణలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉపసంహరించుకున్న కేసులు కూడా మళ్లీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి క్రిమినల్ కేసులు ఉపసంహరించుకోవడం ప్రభుత్వానికైనా అంత తేలిక కాదు. కానీ ఏపీ ప్రభుత్వం చాలా అసువుగా కేసుల ఎత్తివేత మార్గాన్ని ఎంచుకుంది. చివరికి గుంటూరులో పోలీస్ స్టేష్పై దాడులు చేసిన వారిపై కేసులు కూడా ఎత్తివేశారు.