సాగర్ పై కి ఏపీ పోలీసులు చేసిన దండయాత్ర .. రాష్ట్రానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రాజకీయ మిత్రుల స్నేహం కోసం .. ప్రభుత్వాలకు ఉండాల్సిన కనీస నైతిక విలువలు కూడా పాటించకుండా పొరుగు రాష్ట్ర నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుపై దాడిచేయడం.. బలవంతంగా గేట్లు ఎత్తివేయడం క్రిమినల్ చర్య అవుతుంది. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి కో.. మరొకరికో చేటు చేయదు. రాష్ట్రానికి చేస్తుంది. అసలు సాగర్ పై దాడిచేయాల్సిన అవసరం ఏమిటన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
సాగర్ లో అడుగూబొడుగూ నీళ్లు ఉన్నాయి. కరువు వచ్చింది. తాగడానికి నీళ్లు కావాలనేది ఏపీ ప్రభుత్వ వాదన. మరి ప్రాజెక్టు నిర్వహిస్తున్న వారిని అడిగారా ? . నీటి పంపకాలు చేసే కృష్ణాబోర్డును అడిగారా ?. దాహం వేస్తుందని అడగితే.. వారు ఇవ్వకపోతే … మనకు రావాల్సిన నీటిని కూడా ఇవ్వకపోతే.. అప్పుడు తాము దాడి చేశామని చెబితే.. ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారేమో. కానీ ఇక్కడ ముందస్తుగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అర్థరాత్రి పూట టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేసేందుకు వెళ్లినట్లుగా గోడలు దూకి ప్రాజెక్టును ఆక్రమించుకోవడం సంచలనంగా మారింది.
ఈ ఘటన ఖచ్చితంగా ఏపీ ఇమేజ్ పై ఘోరమైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ క్రిమినల్ పాలనలో రాష్ట్రానికి కూడా క్రిమినల్ ఇమేజ్ వచ్చేస్తోందని… సాధారణ ప్రజలు మండిపడే పరిస్థితి వచ్చింది. సొంతంగా దోచుకోవడం.. రాష్ట్రాన్ని తగలబెట్టేసినా రాజకీయ ప్రయోజనాలు పొందడం అన్న లక్ష్యంతో ఉన్న పాలకులు ఏపీకి భారంగా మారారు.