హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి కానీ.. అన్నింటినీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. కానీ ఓ పిటిషన్ మాత్రం ఇబ్బంది పెడుతోంది. వాటిపై న్యాయమూర్తి దూకుడుగా ఉండటం టెన్షన్‌కు గురి చేస్తోంది. అదే రాజ్యాంగ విచ్చిన్న పిటిషన్. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారి.. కొంత మంది కిడ్నాపులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా అదృశ్యమైన కొంత మంది కుటుంబసభ్యులు హైకోర్ట్ లో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో అలాంటి పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది.
రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందంటూ హైకోర్ట్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని భావించింది. ఆ దిశగా వాదనలు వినిపించాలని అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులతోపాటు ఇటు ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాదులు మంగళవారం రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై విచారణ నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు. ఇందుకు హైకోర్ట్ ధర్మాసనం తిరస్కరించింది. తాము సుప్రీంకోర్ట్ కు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసి.. విచారణను వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు ఇస్తే అప్పుడు నిలిపివేస్తామని ఈలోపు వాదనలు వినిపించాలని ధర్మాసనం ఆదేశించింది.
రాజ్యాంగ విచ్ఛిన్నానికి సంబంధించి ఏ అంశాలపై వాదనలు వినిపించాలో తాము ముందే స్పష్టం చేశానని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మౌఖికంగా మాత్రమే చెప్పారని, లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. రాజ్యాంగ విచ్ఛిన్నానికి సంబంధించి ఏ అంశాల్లో జరిగిందో లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇస్తే వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వ తరపు న్యాయవాదాలు.. న్యాయమూర్తుల్ని బెదిరించేలా మాట్లాడటం కలకలం రేపుతోంది. వ్యక్తుల్ని నిర్బంధించడం.. రాజ్యాంగ విచ్చిన్నం చేయడమే. ఇప్పటికే సీబీఐ ద్వారా విచారణ కూడా హైకోర్టు చేయించింది. రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందని హైకోర్టు తీర్పు ఇస్తే.. అది ప్రభుత్వ రద్దకు దారి తీస్తుంది. అందుకే ప్రభుత్వ న్యాయవాదులు… ఆ పిటిషన్ ను విచారిస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ పై వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేస్తున్నారు. డిసెంబర్ 31న జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ అవుతున్నారు. ఆ లోపే ఈ కేసును పరిష్కరించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. గత విచారణల్లో ఇదే విషయాన్ని చెప్పారు. ఈ కేసును పరిష్కరించకపోతే.. ఆ అసంతృప్తి తనకు జీవితాంతం ఉంటుందన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారోనని.. ఏపీ ప్రభుత్వం టెన్షన్‌కు గురవుతోంది.