మాజీ మంత్రి రోజా తీరు తీవ్ర విమర్శల పాలౌతుంది. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో ఆమె వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోవడం వలనే రోజా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రోజా తన భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని తిరుచ్చేందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ సమయంలోనే మరికొంతమంది పారిశుద్ధ్య కార్మికులు తాము కూడా సెల్ఫీ తీసుకుంటామని రోజాను అడిగారు.అయితే, వారిని మాత్రం దూరం జరిగి నిల్చోవాలంటూ రోజా అడిగినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అందులో రోజా వ్యవహరించిన తీరును చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలతో ఇలా దూరం వ్యవహరించడం వల్లే ఆమె మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఓటమి చెందిందో ఆమెకు ఇంకా అర్థం కానట్టే ఉందని అంటున్నారు. రాష్ట్రం ఏదైనా.. పారిశుద్ధ్య కార్మికులనను మరీ అంటరాని వాళ్లలా ట్రీట్ చేస్తారా అంటూ ఆమెపై మండిపడుతున్నారు.