వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం సామాన్యులు పడిన కష్టాలు కళ్ల ముందు ఉండగానే .. తిరుమల కొండపై వీఐపీలు పోటెత్తారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే వీఐపీలు స్వామివారి దర్శనాలు చేసుకుని బయటకు వస్తున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీఐపీలు, టీటీడీ తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి.
తిరుమలలో వీఐపీ సంస్కృతి పెరిగిపోయిందని సామాన్య భక్తులకు ఇచ్చే ప్రాధాన్యత ఈ కారణంగా తగ్గిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. వీఐపీ దర్శన టిక్కెట్లు, సిఫారసు దర్శన టిక్కెట్లను ప్రజా ప్రతినిధులు తమ కోసం మాత్రమే కాకుండా.. అమ్ముకునేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు. దీని వల్ల సామాన్య భక్తులు దోపిడికి గురవుతున్నారు. అందుకే వీఐపీ సంస్కృతి తగ్గించాలని, సిఫారసు లేఖలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే ఎన్ని వివాదాలు చెలరేగినా ఈ వీఐపీ సంస్కృతి మాత్రం మారడం లేదు.
పర్వదినాల్ల్లో సామాన్య భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇలాంటి సమయంలో వీఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తారు. కొంత మంది కోసం.. సామాన్య భక్తులను నిలిపివేస్తారు. దీని వల్ల వారు ఎదుర్కొనే కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. వైకుంఠ ద్వార దర్శనం సామాన్యుల కంటే ముందే వీఐపీలు చేసుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా వచ్చారు. టీటీడీ కూడా పర్వదినాల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ ఉంటుంది. కానీ .. ఆచరణలోకి వచ్చే సరికి పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.
వీఐపీలు అంటే ప్రజా ప్రతినిధులే. వారు ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాప్రతినిధులు అయ్యారు. వారి ముందు వీఐపీ తనం పాటించడం అదీ కూడా దేవుడి దగ్గర పాటించడం మంచిది కాదు. కానీ అదే పని చేస్తున్నారు. ఎన్ని దుర్ఘటలు జరిగినా పాఠాలు నేర్చుకోవాల్సిన నేతలు కానీ.. టీటీడీ కానీ సిద్దపడటం లేదు. ఆరుగురు చనిపోయిన తర్వాత అయినా మారరా? ఇంకెప్పుడు మారతారు ?