మలయాళంలో ఘన విజయం సాధించడమే కాదు, విమర్శకుల ప్రసంశలనూ అందుకొంది ప్రేమమ్. నవతరం ప్రేమ కావ్యంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ప్రేమకథలకు బాగా సూటయ్యే నాగచైతన్య కథానాయకుడిగా నటించడం, అనుపమ పరమేశ్వరన్‌ని తెలుగులోనూ దించడం ఈ రీమేక్‌కి ప్లస్ పాయింట్లుగా మారాయి. కార్తికేయతో ఆకట్టుకొన్న చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఓకే అనిపించాయి. ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రేమమ్ ఎలా ఉండబోతోందో తెలిసొచ్చింది. ఇంతకీ ప్రేమమ్ సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే..
మలయాళ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీయడానికే దర్శకుడు చందూ మొండేటి ప్రయత్నించాడని టాక్. అయితే అక్కడక్కడా కాస్త కామెడీని మిళతం చేస్తూ సినిమాని లైటర్ వేలో చెప్పడానికి ట్రై చేశాడట. చందూ మొండేటి ఈ సినిమాకి కొత్తగా ట్రై చేసిందేమైనా ఉంటే అది కామెడీ ఎలిమెంటే అని సమాచారం. చైతూకి మరింత రొమాంటిక్ ఇమేజ్ రావడానికి ఈ ప్రేమమ్ దోహదపడబోతోందని చెబుతున్నారు. మూడు రకాల పాత్రల్లో చైతూ నటన ఆకట్టుకోనున్నదని టాక్. విజువల్‌గా ఈ సినిమా సూపర్బ్‌గా వచ్చిందని, అనుపమ పరమేశ్వరన్ల నటన ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. కథలో కాస్త ల్యాగ్ ఉందని, దాన్ని కాస్త భరించగలిగితే ఈ సినిమా తెలుగులోనూ మంచి ఫలితాన్నే రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చైతన్య – శ్రుతి కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ అవ్వలేదని, శ్రుతిది రాంగ్ ఛాయిస్ ఏమో అనిపించొచ్చన్నది లాబ్ రిపోర్ట్. ప్రేమ కథలో డైలాగుల్లో డెప్త్ తక్కువైందని, మలయాళం ప్రేమమ్‌కీ తెలుగు ప్రేమమ్‌కీ ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మైనస్సుల్ని దాటుకొని వస్తే.. ప్రేమమ్ తెలుగులో హిట్ సినిమాగా నిలిచిపోవొచ్చు. మరి ప్రేమమ్ స్థాయి ఏమిటి? హిట్ రేంజ్ ఎంత అనేది తెలియాలంటే అక్టోబరు 7వరకూ ఆగాల్సిందే.