పదేళ్ళ పాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని అధికారం కోసం కటోర తపస్సు చేసిన చంద్రబాబు నాయుడుని రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజాదేవుళ్ళు కరుణించి అధికారం కట్టబెట్టారు. వారు కరుణిస్తారో లేదో అనే అనుమానంతో ఎందుకైనా మంచిదని వారిని ప్రసన్నం చేసుకొనేందుకు చంద్రబాబు నాయుడు ఎడాపెడా వాగ్దానాలు గుప్పించేశారు. ఆ జాబితాని జగన్మోహన్ రెడ్డి, వైకాపా నేతలు గత రెండేళ్ళుగా వల్లె వేస్తుండటం చేత అది ప్రజలకి కూడా కంఠోపాటం అయిపోయింది. ఇప్పుడు ఎవరిని అడిగినా తడుము కోకుండా వాటి గురించి టకటకా అప్పజెప్పేస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ కొండవీటి చేంతాడు జాబితాలో అన్నిటి కంటే పైనున్నది పంట రుణాల మాఫీ. ఆ హామీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గుదిబండగా మారగా, దానిపై దాడి చేయడానికి అది ప్రతిపక్షాలకి బలమైన ఆయుధంగా మారింది.
రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక సమస్యలని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం చాలా కష్టమే. కానీ చేయకపోతే ప్రతిపక్షాలు రచ్చ రచ్చ చేస్తాయి గాబట్టి తప్పడం లేదు. ప్రభుత్వం నిన్నటి నుంచి పంట రుణాల మాఫీ పత్రాలను రైతులకి అందజేస్తోంది.
ఒక్క కృష్ణా జిల్లాలోనే 6,84, 420 మంది రైతులకు రుణాలు మాఫీ చేయవలసి ఉంది. వారికి గత ఏడాది రూ. 951.34 కోట్లు రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. వారిలో కొందరు రాజధాని కోసం తమ భూములు ఇచ్చినవారున్నారు. వారి భూములకి ప్రభుత్వం చెల్లించవలసిన సొమ్ములో ఈ పంట రుణాలని కోసుకొని మిగిలిన మొత్తం చేతిలో పెడుతోంది. ఆ ప్రకారం చూసినా ఈ ఏడాది రెండవ వాయిదాలో 20 శాతం రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం 5,22,321 మంది రైతులకి రూ. 486. 47 కోట్లు చెల్లించబోతోంది. ఇది ఒక్క కృష్ణా జిల్లాకి చెందిన రుణమాఫీ లెక్కలు మాత్రమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అది వేల కోట్లు ఉంటుందని అర్ధమవుతుంది.
కష్టాలలో ఉన్న రైతులని ఆదుకోవడానికే పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ, అది రైతులని ఆకట్టుకొని అధికారంలోరావడం కోసమేనని అందరికీ తెలుసు. అప్పుడు రైతులని ఆదుకోవడానికే రుణమాఫీ అన్న చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీ వేసి సర్వేలు చేయించి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొన్నవారిలో 52-56 శాతం మంది ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారని తేల్చి ఆ ‘భారం’ సగానికి తగ్గించుకొన్నారు. మిగిలిన భారాన్ని అయిష్టంగానైనా మోయక తప్పడం లేదు. మళ్ళీ దానిని ఇంకా తగ్గించుకొనేందుకు రకరకాల ఆలోచనలు, ప్రతిపాదనలు ప్రభుత్వం చేస్తోంది.
ఇదంతా చూస్తున్నవాళ్ళు అసలు అటువంటి హామీ ఇవ్వడం ఎందుకు ఇప్పుడు బాధపడటం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఆ హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం చాలా ఆపసోపాలు పడుతున్నా, దాని వలననే తెదేపా అధికారంలోకి రాగలిగింది కదా? అయినా ప్రభుత్వమేమీ తెదేపా నేతల జేబులో డబ్బుని తీసి రైతులకి పంచిపెట్టడం లేదు…ప్రజలందరూ కట్టిన పన్నులలో నుంచే తీసి ఇస్తోంది.
ఈ పంట రుణాల మాఫీ వ్యవహారాన్ని చూస్తుంటే ఎవరికైనా కొన్ని సందేహాలు కలుగక మానవు 1. రాష్ట్రంలో మిగిలిన ప్రజలు అందరూ పంట రుణాలు తీసుకోకుండా పొరపాటు చేశారా? 2. తెదేపా అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన ఆ హామీని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో రుణాలు తీసుకోని ప్రజలు పన్నుల రూపంలో మూల్యం చెల్లించవలసిన అవసరం ఉందా? తెదేపా ఆ హామీని ఇచ్చినప్పుడు ఆ భారం తెదేపా నేతలే మోయవచ్చు కదా? ప్రజలపై ఎందుకు మోపుతున్నారు? ఇటువంటి సమాధానం దొరకని ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
ఈ మొత్తం వ్యవహారం రాజకీయ పార్టీలకి, ప్రజలకి కూడా ఒక చక్కటి గుణపాఠం నేర్పుతోంది. అధికారంలోకి రావడం కోసం ఇటువంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వకూడదు అని రాజకీయ పార్టీలకి, అటువంటి హామీలు ఇచ్చిన పార్టీలకి ఓట్లు వేయకూడదు అని ప్రజలకి పాఠంగా భావించవచ్చు. మరి వచ్చే ఎన్నికలలో మన రాజకీయ పార్టీలు ఇంకేమీ హామీలు గుప్పిస్తాయో? ప్రజలు వాటికి పడతారో లేదో చూడాలి.