ఆంధ్రప్రదేశ్లో పండుగ సందడి ఈ సారి రెట్టింపులో కనిపిస్తోంది. గతంలో లేని విధంగా ఈ సారి సొంత ఊళ్లకు జనాలు వచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఇలా వచ్చిన వారంతా ఆటవిడుపుగా కోడి పందేల వైపు చూశారు. చాలా మంది గోదావరి జిల్లాలకు పయనమయ్యారు. గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందేలు, ఇతర వేడుకలు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. కనుమ రోజు కూజా పెద్ద ఎత్తున పందేలు జరగనున్నాయి.
సంక్రాంతి పండుగకు ప్రత్యేకత కోడిపందేలు. ఇప్పుడు అవి పులివెందులలోనూ నిర్వహిస్తున్నారు. అంటే సంక్రాంతికి బ్రాండ్ అంబాసిడర్ గా కోడిపందేలు మారిపోయాయని అనుకోవచ్చు. గోదావరి జిల్లాలలో జరుగుగుతున్న కోడిపందేలలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. అంతా గెలిచే వాళ్ల గురించి మాట్లాడతారు కానీ.. అదే సమయంలో మరో వ్యక్తి ఓడిపోతాడని అనుకోవడం లేదు. ఇలాంటి పందేల బారిన పడి సర్వం కోల్పోయిన వాళ్లు ఉంటారు. అలాగని గెలుపు సాధించిన వారు బాగుపడతారని లేదు. గెలిచామన్న ఉత్సాహంతో ఇంకా ఇంకాపందేలు ఆడి మిగతావి కూడా పోగొట్టుకుంటారు.
రోజుకు కనీసం వంద కోట్లు చేతులు మారుతున్నాయని మీడియా ప్రచారం చేస్తోంది. స్టేడియాల మాదిరిగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న గ్యాంబ్లింగ్ ని చూస్తూంటే అంత కంటే ఎక్కువగానే బండ్లు జరుగుతూ ఉండవచ్చు. కానీ ఈ సంస్కృతి అంతకంతకూ పెరిగితే మాత్రం.. రానున్న రోజుల్లో సంక్రాంతి పండగ అంటే.. మిగతా అన్ని మర్చిపోతారు. కేవలం కోడి పందేలు అనుకుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సి ఉంది.