జాతీయ మీడియాల్లో సర్వేలు అనుకూలంగా రావడానికి జగన్ రెడ్డి కొన్ని చానళ్లకు అడ్డగోలుగా కోట్లు కట్టబెడుతూ వస్తున్నారు. తాజాగా ఇండియా టుడే కోసం మరో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ సొమ్ము విద్యాశాఖది. పిల్లలది. అయినా సరే ప్రవీణ్ ప్రకాష్ ఈ మొత్తం ఇండియాటుడేకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇండియాటుడే ఎడ్యుకేషన్ మీద ఓ కాంక్లేవ్ నిర్వహిస్తోంది. ఇందులో నాలుగు ప్యానల్ డిస్కషన్లను బుక్ చేసుకోవడానికి నాలుగు కోట్ల ఇరవై లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ప్యానల్ డిస్కషన్లతో ఏమి వస్తుంది.. అసలు అంత అవసరం ఏమిటి… అంటే.. ఏమీ రాదు. జగన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు వేయడానికి అడ్డగోలుగా అక్రమ మార్గంలో చేసే చెల్లింపులు ఇవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి కూడా జగన్ రెడ్డి ప్రజల డబ్బులే వాడుతూండటం విషాదం.
ఇప్పటికే టైమ్స్ నౌ, ఎన్డీటీవీలకు ఇమేజ్ బిల్డింగ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కీలక కాంట్రాక్ట్ ను టైమ్స్ నౌ గ్రూపునకు ఇచ్చారు. ప్రతి వాళ్లు.. తాడేపల్లి ప్యాలెస్ లో తయారయ్యే ఈటీజీ సర్వేలను నెలకోసారి ప్రసారం చేస్తూంటారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టడే ప్రకటించే సర్వేల్లో.. జగన్ రెడ్డికి మంచి ఫలితాలు రావడంలేదు. అందుకే ఈ సారి మరింత ప్రజాధనం పెట్టి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.