ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పది రోజుల కిందటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో దాదాపుగా కేంద్రమంత్రులంతా పాల్గొన్నారు. బీజేపీకి అనుకూలమైన పారిశ్రామికవేత్తలే కాదు..దాదాపుగా ఓ మాదిరి పారిశ్రామికవేత్తలంతా హాజరయ్యారు. కేంద్రం సంపూర్ణంగా సహకరించడం వల్లనే ఇది సాధ్యమయింది.
రెండు రోజుల సమ్మిట్‌లో యూపీకి పారిశ్రామిక వేత్తలకు మధ్య 32 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 18వేల ఎంవోయూలు జరిగాయి. ఏపీలోలాగా అక్కడ కూడా గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. అయితే మరీ అరవై శాతం.. డెభ్బై శాతం కాదు. దాదాపుగా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు వచ్చాయి. గ్రీన్ ఎనర్జీలో ఎక్కువ.
రిలయన్స్ అంబానీ ఏకంగా రూ. డెభ్బై వేల కోట్ల పెట్టుబడులను వ్చచే నాలుగేళ్లలో యూపీలో పెడతామని ప్రకటించారు. లక్ష ఉద్యోగాలిస్తామన్నారు. ఏపీలో ఆయన ఇతమిత్థంగా ఇంత పెట్టుబడి పెడతామని చెప్పలేదు. గతంలో తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెజ్ పెట్టాలని నిర్ణయించుకుని వెనక్కి తగ్గారు. కనీసం ఆ పెట్టుబడి కూడా ప్రకటించలేదు. ఇక టాటాలు..బిర్లాల సంగతి చెప్పాల్సిన పని లేదు. వారు కూడా హాజరై తమ పెట్టుబడుల ప్రణాళికల్ని వివరించారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే సాధ్యమయింది
అయితే ఏపీకి వచ్చే సరికి పెట్టుబడుల సదస్సు ప్రారంభానికి కనీసం ఓ కేంద్ర మంత్రి రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గడ్కరీ వచ్చినా మొక్కుబడిగా పాల్గొని.. మెడ్ టెక్ జోన్లో పర్యటించి వెళ్లిపోయారు. శనివారం కిషన్ రెడ్డి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని..తీరిక సమయంలో సమ్మిట్ కు వచ్చి ఏపీకి సహకరిస్తామని చెప్పారు. పోమరో మంత్రి వచ్చి కూడా ఉపయోగం లేకపోయింది. యూపీ విషయంలో ఇచ్చినంత సహకారం ఇవ్వకపోవడంతో.. యూపీలో 30లక్షల కోట్ల దాకా పెట్టుబడులు వెళ్తే.. ఏపీ 13 లక్షల కోట్ల ఎంవోయూలకే పరిమితమైంది.