హైదరాబాద్: డిమాండ్‌కు మించిన సప్లయ్‌తో అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్ ఆయిల్) ధర కనిష్ఠంగా బ్యారెల్ 37 డాలర్లకు పడిపోయింది. గత ఏడాది జూన్‌లో 100 డాలర్లు పలికిన బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో 37.65 డాలర్లకు దిగిపోయింది. లండన్ మార్కెట్లో కూడా బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 39.96 డాలర్లకు దిగొచ్చింది.
సాధారణంగా నిల్వలు భారీగా పేరుకుపోయి రేట్లు పతనమవుతుంటే ఉత్పత్తిని తగ్గించాలి. కానీ చమురు ఉత్పత్తి దేశాలు తమ తమ మార్కెట్లను కాపాడుకునేందుకు ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉన్నాయి. గతంలో ధర పెంచేందుకు ఒపెక్(చమురు ఎగుమతి దేశాల సమాఖ్య) ఎప్పటికప్పుడు ఉత్పత్తిలో కోత విధించేవి. ఇప్పుడు అమెరికాలో కూడా ముడి చమురు ఉత్పత్తి భారీగా పెరిగింది. దీంతో మార్కెట్ వాటా కాపాడుకునేందుకు ఒపెక్ కూడా పోటీపడి చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఒపెక్ లోని 12 సభ్యదేశాలు గత నెలలో రోజుకు 31.5 మిలియన్ బ్యారెళ్ళ ముడి చమురు ఉత్పత్తి చేశాయి. అటు అమెరికాలో షేల్ ఆయిల్ కూడా గణనీయంగా ఉత్పత్తి అవుతోంది. ఈ పరిణామాల కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర ఏకంగా ఏడేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరింది. దీనికి తోడు ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు తొలిగితే ఆ దేశంకూడా మరింత పెద్ద ఎత్తున ముడి చమురు ఉత్పత్తి చేస్తుంది. అటు రష్యాకూడా ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ముడి చమురు ఉత్పత్తి చేస్తోంది. ఈ పరిణామాలతో 2016లో బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లకు కూడా పడిపోయే అవకాశముందని గోల్డ్‌మన్ శాచ్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది.
అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే చమురు ధర మరింత పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద చమురు వినియోగదారు అయిన చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ నీరసించటంకూడా ఒపెక్ దేశాలను భయపెడుతోంది. ఐరోపా, జపాన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కష్టాలలో ఉన్నాయన్న వార్తలు మొత్తం పెట్రోలియం ఉత్పత్తి దేశాలను కలవరపరుస్తోంది. పెట్రోల్ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన రష్యా, వెనిజులా ఇప్పటికే ఆర్థికంగా గిజగిజలాడుతున్నాయి. పెట్రో డాలర్లకు పెట్టింది పేరైన సౌదీ అరేబియా కూడా అప్పులు చేసి ద్రవ్యలోటు పూడ్చుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోల్డ్‌మన్ శాచ్ సంస్థ అంచనా వేసిన విధంగా బ్యారెల్ చమురు ధర 20 డాలర్లకు పడిపోతే ఈ దేశాల ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముడి చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు మరింత కలిసొచ్చి, దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు మరింత తగ్గాల్సి ఉన్నప్పటికీ అలా జరగకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతీయ కొనుగోలుదారులకు ఆ ప్రయోజనాలు దక్కటంలేదు. ప్రభుత్వం పన్నులు ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండటమే దానికి కారణం. ఇక రేటు పడిపోవటమన్నది చమురు ఉత్పత్తి కంపెనీలకు కూడా ప్రతికూల విషయమే. గిట్టుబాటు ధర లభించకపోవటంవల్ల కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేసి, రిస్కులు తీసుకోవటానికి ఇష్టపడవు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా చమురు కంపెనీలు ఇటు పెట్టుబడులు తగ్గించుకోవటం, అటు కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టకపోవటం దీనికి నిదర్శనం. ఇదే పరిస్థితి కొనసాగితే అంతిమంగా డిమాండ్ కన్నా ఉత్పత్తి తగ్గిపోయి రేట్లు మళ్ళీ పెరుగుతాయి.