ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంల భద్రత, ఆ తరువాత ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి… ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విధుల కిందికి వస్తాయి. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ, కలెక్టర్లు అందరూ సీఈవో నియంత్రణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, దీనికి భిన్నంగా ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి, ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి భద్రత ఉండాలనే అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించడం విశేషం. ఎన్నికల ఫలితాల వెల్లడిపై ఆయన సమీక్ష చేయడమేంటీ, అది ఈసీవో బాధ్యత కదా అంటూ ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా… తన పని తాను చేసుకుంటూ పోయారు సుబ్రమణ్యం.
వచ్చేనెల 23న ఓట్ల లెక్కింపునకు కావాల్సిన పకడ్బందీ ఏర్పట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు సీఎస్. సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ, డీజీపీ ఠాకూర్ కూడా హాజరయ్యారు. పోలింగ్ సందర్భంగా ఈవీఎంలపై పలు ఆరోపణలు వచ్చాయనీ, సిబ్బంది సరైన శిక్షణ ఇవ్వని కారణంగానే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయన్నారనీ, ఓట్ల లెక్కింపు సమయంలో అలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలనీ, కౌంటింగ్ చేసే టేబుల్స్ దగ్గర్నుంచీ భద్రత వరకూ అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పనిచేసే అధికారుల శిక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని సూచించారు. ఆ తరువాత, ద్వివేదీ కూడా మాట్లాడుతూ… ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు! స్ట్రాంగ్ రూముల భద్రతపై కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టు కథనాలు వస్తున్నాయనీ, మూడంచెల్లోభద్రత ఉందనీ ఎవ్వరూ అనుమానపడాల్సిన అవసరం లేదన్నారు.
ఓవరాల్ గా సీఎస్ నిర్వహించిన సమీక్ష ఎలా సాగిందంటే… రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది! ఈవీఎంలను భద్రపరచిన కేంద్రాల భద్రత గురించి, భదత్రా బలగాల గురించి, ఓట్ల లెక్కింపులో పాల్గొనేవారి శిక్షణ గురించి… ఇలాంటివన్నీ సీఎస్ మాట్లాడాల్సిన పనేముంది..? ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి విధుల కిందకి వస్తాయి కదా? ఉన్నట్టుండి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపైనా, ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన విధులపైనా సీఎస్ సమీక్ష నిర్వహించొచ్చా..?