ఆలిండియా సర్వీస్ అధికారులకు కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తే… రిటైర్మెంట్ తర్వాత కూడా అవి వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నికల సంఘం అండతో.. ఏపీలో చీఫ్ సెక్రటరీగా నియమితులైన.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఈ సర్వీస్ రూల్స్ ను పదే పదే అతిక్రమిస్తున్నారు. పైగా తన తప్పులకు సాక్ష్యాలను నేరుగా.. చంద్రబాబుకే పంపారు. ఇప్పుడది చంద్రబాబుకు బ్రహ్మస్త్రంలా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. చీఫ్ సెక్రటరీ.. కేవలం.. ఎన్నికల విధుల కోసం.. ఈసీ చేత నియమించబడిన వ్యక్తి మాత్రమే. ఎన్నికలకు సంబంధం లేని పాలనాంశాల్లో… ప్రజాప్రభుత్వానికే రిపోర్ట్ చేయాలి. కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. అంతకు మించి చేస్తున్నారు. అలా చేసిన వాటిలో ఒకటి.. టీటీడీ బంగారాన్ని.. తమిళనాడులో ఈసీ అధికారులు పట్టుకోవడంపై వేసిన విచారణ కమిటీ.
కోడ్ ఉన్నా.. లేకపోయినా… టీటీడీ బంగారం.. ఇతర అంశాలు ఏవీ ఈసీ పరిధిలోకి రావు. అవి ఎన్నికలకు సంబంధం లేని అంశాలు. అలాంటి అంశంపై.. సీఎస్ ఏకపక్షంగా విచారణకు ఆదేశించారు. మన్మోహన్ సింగ్ కమిటీ పేరుతో.. ఏక సభ్య కమిటీని నియమించారు. ఓ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ప్రభుత్వాధినేతకు సమాచారం లేకుండా.. ఆయన అనుమతి లేకుండా విచారణ కమిటీ వేయడమే.. చాలా పెద్ద తప్పు. ఇది కచ్చితంగా.. అధికారాలను అతిక్రమించడమే. సర్వీస్ రూల్స్ ను బ్రేక్ చేయడమే. అయితే.. విచారణకు ఆదేశించినప్పుడు సీఎం సైలెంట్ గా ఉన్నారు. కమిటీ నివేదిక వచ్చే వరకూ సైలెంట్‌గా ఉన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత సీఎస్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఇక తప్పని సరిగా.. సీఎంకే పంపాలి కాబట్టి… చంద్రబాబు వద్దకు పంపారు. ఇప్పుడు ఆ నివేదిక తన దగ్గరకు చేరిన తర్వాత చంద్రబాబు…ఎల్వీకి నట్లు బిగించడం ప్రారంభించారు.
తనను సంప్రదించకుండా విచారణకు ఆదేశించటం, ఆ నివేదికను తనకు పంపించి ర్యాటిఫై చేయమని కోరడంపట్ల చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవదేవుని బంగారం తీసుకొచ్చి అప్పజెప్పాల్సిన వారిని వదిలేసి, టీటీడీ అధికారులపై చర్యలు తీసుకోమని కోరడం పట్ల చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి పంపిన నివేదికను తన వద్దే ఉంచుకున్నారు. ఆ నివేదికలోనూ నిబంధనలు పొందు పర్చలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బంగారాన్ని ట్రెజరీ నుంచి తీసుకెళ్లిన వారు, తిరిగి తీసుకొచ్చి అప్పగించేవరకు బాధ్యత వారిదేనన్న విషయం తెలియనట్లుగా నివేదిక ఉండటంతో.. చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇలా వదిలి పెట్టకూడదని… కచ్చితంగా.. సీఎస్‌తో పాటు.. ఆయనకు అనుకూలంగా ఉంటూ.. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైనా… చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. దీని కోసం న్యాయనిపుణులనూ సంప్రదిస్తున్నారట. వ్యవహారం అంతా ఉద్దేశ పూర్వకంగా సర్వీస్ రూల్స్ ను అతిక్రమించినట్లు కనిపిస్తూండటంతో… ఎల్వీ సుబ్రహ్మణ్యంకు… అటు విధి నిర్వహణలో సీబీఐ కేసుతో పాటు… ఈ సర్వీస్ అతిక్రమ చిక్కులు కూడా… రిటైర్ అయినా… తప్పవని… కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.