ఎన్నికల కమిషన్ ఆదేశాలను 24 గంటల్లో అమలు చేయాల్సి ఉంటుంది. మూడు రోజులైనా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ..ఆ ఆదేశాలను అమలు చేయలేదు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో.. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీ, పలువురు సీఐలపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ .. ఆదివారమే సిఫార్సు చేశారు. వీటిని సీఎస్ అమలు చేయకపోగా..ఎన్నికలు జరపాలంటూ.. లేఖ రాసి.. ఎన్నికల కమిషన్కు అందడానికంటే ముందుగానే మీడియాకు విడుదల చేశారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కింద అధికారులంతా పనిచేయాల్సి ఉంటుంది. ఉల్లంఘించటం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆదేశాలను తిరస్కరించటం అవుతుంది. దీనిపై.. ఎస్ఈసీ తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అమలు జరపాల్సిందిగా మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం.. లేదా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం… చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో తన ఆదేశాలను.. సీఎస్ పట్టించుకోలేదని.. ఎన్నికల కమిషన్ హైకోర్టుకు వెళ్తే.. నీలం సహాని గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇప్పటికే సీనియర్ అధికారులు తేల్చేశారు. రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి కల్గిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు జరపకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అసలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాయటమే నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల కమిషన్ ఉనికిని గుర్తించడానికి సిద్దంగా లేరు. తానే ముఖ్యమంత్రినని.. అధికారులను బదిలీ చేయడానికి ఆయనెవరని.. ఆదివారమే ప్రెస్మీట్లో స్పష్టం చేశారు. అదే మాటకు కట్టుబడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా..సీఎస్ అధికారులను బదిలీ చేయడం అసాధ్యం. ముఖ్యమంత్రి అంగీకరించే అవకాశం లేదు. అందుకే.. రెండో సారి ఎన్నికల కమిషనర్ లేఖ రాసినప్పటికీ… బదిలీలు చేసే అవకాశం లేదని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని.. చెబుతున్నారు. అయితే.. రాజ్యాంగ సంక్షోభం తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఇది ముదిరితే.. మొత్తంగా ప్రభుత్వమే ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.