రిటైరయ్యే ముందు సీఎస్ జవహర్ రెడ్డి శేష జీవితం అంతా కేసుల్లో నలిగిపోవడానికి అవసరమైన సాక్ష్యాలతో ఇరుక్కుపోయారు. వైసీపీ నేతలతో కలిసి ఆయన కుమారుడ్ని ధనవంతుడ్ని చేయాలన్న తపన సీఎస్ ఎడాపెడా చేసిన తప్పులతో ఆయన రిటైర్మెంట్ జీవితం అత్యంత భయంకరంగా ఉండబోతోందని అధికారవర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసైన్డ్ భూముల దందా లీక్ చేసింది అధికారులే !
విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎస్ భూ దందా చేస్తున్నారు. తాను జారీ చేసిన ఓ జీవోను అడ్డం పెట్టుకుని వందల ఎకరాలు కొనుగోలు చేస్తున్నారని… దానికి కొంత మంది బినామీలను అడ్డం పెట్టుకున్నారని బయట వాళ్లకు తెలియదు. అత్యంత కీలకమైన కొంత మంది అధికారులకే తెలుసు. వారు కూడా సీఎస్ సన్నిహితులే. తర్వాత వారే ఈ సమాచారాన్ని విపక్ష పార్టీకి లీక్ చేశారు. వారు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు సీఎస్ పరిస్థితి కక్కలేక మింగలేక అనే పరిస్థితి ఏర్పడింది.
కుమారుడి మైనింగ్ దందాలో కూడా హస్తం
జవహర్ రెడ్డి కుమారుడు పండిత పుత్ర టైపు అని తెలుస్తోంది. ఆయన ను వైసీపీ నేతలతో కలిసి వ్యాపారవేత్తగా మార్చాలని జవహర్ రెడ్డి మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా మైనింగ్ లోకి దింపారని.. తరవాత అసైన్డ్ ల్యాండ్స్ వ్యవహారాల్లోకి లాగారని అంటున్నారు. ఇప్పుడీ విషయాలు బయటకు రావడంతో తన కుమారుడు అసలు ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టలేదని అంటున్నారు.
వచ్చే నెలాఖరులో రిటైర్మెంట్ – కానీ !
వచ్చే నెలాఖరులో సీఎస్ రిటైరవ్వాల్సి ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉంటూ కీలక పోస్టుల్లో ఉండే ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయారు. విపక్షాల టార్గెట్ గా అనేక కుట్రలు చేశారు. ఈ సారి ప్రభుత్వం మారితే ఆయనను అంతకు మించి టార్గెట్ చేస్తారు. రిటైర్మెంట్ అంత సాఫీగా ఉండదు. కేసులతో జీవితాంతం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అధికారవర్గాలే అంటున్నాయి.