ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో కొలకొత్తాని బెంగళూరు మట్టికరిపించింది. ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఉప్పల్ లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ని చిత్తు చేసింది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రతాపం చూపించింది. ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ బ్యాటింగే హైలెట్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ లో రెండో అత్యధిక స్కోరు. తొలి స్థానం కూడా సర్‌రైజర్స్ (287)దే. బ్యాటింగ్‌లో సన్ రైజర్స్‌కు తిరుగులేదు. పైగా సొంత గడ్డపై చెలరేగిపోవడం హైదరాబాద్‌కు ఆనవాయితీనే. అయితే తొలి మ్యాచ్‌లోనే బ్యాటర్లంతా ఫామ్ లోకి రావడం శుభసూచికం. ముఖ్యంగా ఇషాన్ కిషన్ సెంచరీ (47 బంతుల్లో 106 నాటౌట్) చెలరేగిపోయాడు. హైదరాబాద్ తరపున తొలి మ్యాచ్ ఆడిన ఇషాన్.. ఏ దశలోనూ రాజస్థాన్ బౌలర్లను కుదురుకోనివ్వలేదు. ముచ్చటైన క్లాస్ బ్యాటింగ్ తో ఆకట్టుకొన్నాడు. హెడ్ (31 బంతుల్లో 67) కూడా తన ఫామ్ చాటుకొన్నాడు. 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ బాగానే పోరాడింది. 20 ఓవర్లలో 242 పరుగులు చేయగలిగింది. సంజూ శాంసన్ (37 బంతుల్లో 66), ధృవ్ (35 బంతుల్లో 70) రాణించారు. కానీ కొండంత లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. చివరికి సన్ రైజర్స్‌కు 44 పరుగుల విజయం దక్కింది.
చెన్నై – ముంబై మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా నడిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో చెన్నై ధాటిగానే బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్లు ముగిసే సరికి 97 పరుగులు చేసి, లక్ష్యానికి చేరువైంది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో పరుగులు రావడం గగనమైంది. ఇలాంటి దశలో ఓపెనర్ రచిన్ రవింద్ర (45 బంతుల్లో 65 నాటౌట్) సమయస్ఫూర్తిగా ఆడడంతో 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకొంది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ (26 బంతుల్లో 53) రాణించాడు. ముంబై జట్టులో తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. 2012 నుంచి 2024 వరకూ ప్రతీ సీజన్లోనూ ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఓడిపోవడం కామన్. ఈ రికార్డు ఈ యేడాది నిలబెట్టుకొంది.