గత రెండు ఆదివారాలు రోమాంఛికరమైన మ్యాచ్‌లతో ఐపీఎల్ టోర్నీ ఉత్కంఠ తారస్థాయికి చేరింది.ఈ ఆదివారం కూడా దాదాపుగా అలాగే జరిగింది.కానీ.. చెన్నై టీం … ఇందులో తనదైన ప్రత్యేకత చాటింది. ఇది చెన్నై టీమేనా అన్నంతగా తేలిపోతున్న జట్టు ఒక్క సారిగా జూలు విదిల్చింది. తాము తల్చుకుంటే… ఎలాంటి లక్ష్యాన్నైనా ఉఫ్‌మని ఊదేస్తామని నిరూపించారు. పంజాబ్ జట్టు.. బాగా ఆడామని సంతృప్తి చెంది.. ఉంచిన స్కోరును చెన్నై వికెట్ నష్టపోకుండా… ఆడుతూ పాడుతూ చేధించేసింది. టైటిల్ వేటలో తమను తక్కువ చేయాల్సిన అవసరమే లేదని తేల్చేసింది.
అబుదాబిలో పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రాణించడంతో 178 పరుగులు చేసింది. 179 పరుగుల లక్ష్యం అంటే చిన్నదేం కాదు. అదీ బ్యాటింగ్‌లో తరచూ విఫలం అవుతున్న చెన్నైకి అంటే ఎక్కువే. కష్టమే అనుకున్నారంతా. కానీ.. చెన్నై బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే.. పంజాబ్ ఇచ్చిన లక్ష్యం మరీ అంత చిన్నదా అని అందరూ అనుకునేలా అయిపోయింది. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ సాధికారికంగా ఆడారు. ఎక్కడా తడబడలేదు. గ్రౌండ్ చుట్టూ బౌండరీలతో హోరెత్తించారు. బౌలర్ ఎవరున్నా.. ఒకటే ట్రీట్మెంట్ . మొదట్లోనే వారి జోరు చూసిన వారు .. చెన్నై విజయం ఖాయమని అంచనాకు వచ్చేశారు. అయితే ఐపీఎల్ కాబట్టి.. ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో అని చూశారు. కానీ.. అద్భుతాలు చెన్నై వైపే జరిగాయి. ఒక్క వికెట్ కూడా పడలేదు.
మొత్తం 17.4 అంటే 106 బంతుల్లోనే 181 పరుగులు కొట్టేశారు. ప్రతీ బౌలర్‌కు సగటున ఓవర్‌కు పది పరుగులు వడ్డించారు. వ్యక్తిగత రికార్డుల కోసం వాట్సన్, డూప్లెసిస్ ఇద్దరూ ప్రయత్నించలేదు. సమానంగా స్కోర్ చేస్తూ వచ్చారు. వాట్సన్ 83, డుప్లెసిస్ 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇతరులకు బ్యాటింగ్‌కు దిగే అవకాశమే రాలేదు. ఈ విజయంతో చెన్నై టీం మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లయింది. పాయింట్ల పట్టిన అట్టడుగున ఉన్న స్థానం నుంచి ఆరో స్థానానికి చేరారు. ఈ రోజు ముందు ముందు కొనసాగిస్తే.. చెన్నై మళ్లీ హాట్ ఫేవరేట్ టీముల్లో ఒకటిగా చోటు దక్కించుకోవచ్చు.