గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌గా పని చేస్తూ ఏపీకి రావాల్సి వచ్చిన ఐఏఎస్ కాట అమ్రపాలికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారన్నదానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆమె చురుకైన ఆఫీసర్ కాబట్టి పవన్ కల్యాణ్ పేషీలో పోస్టింగ్ ఉటుందని కొంత మంది మొదటి రోజు నుంచే ప్రచారం ప్రారంభించారు. కానీ విజయవాడ కమిషనర్, గ్రేటర్ విశాఖ కమిషనర్ వంటి పోస్టులకూ ఆమె పేరు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అమ్రపాలికి ఉన్న ఇమేజ్ కారణంగా ఈ చర్చ జరుగుతోంది. పనితీరులో ఆమె అద్భుతాలు సృష్టించినట్లుగా ఇప్పటి వరకూ రికార్డులు లేవు.
కాట అమ్రపాలి విశాఖలోనే ఎక్కువ కాలం గడిపారు. చదువులు కూడా ఎక్కువగా అక్కడే గడిచాయి. ఆమెను ఏపీ క్యాడర్ కు కేటాయించడానికి కారణం యూపీఎస్సీకి దరఖాస్తు చేసినప్పుడు పర్మినెంట్ అడ్రస్‌గా విశాఖ పెట్టడమే. అక్కడకు కమిషనర్‌గా వెళ్లేందుకు కాట అమ్రపాలి కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. చంద్రబాబు స్టైల్ మేనేజ్మెంట్లో ఐఏఎస్ అధికారుల శక్తి సామర్థ్యాలు, వారికి ఏ ఏ విభాగాల్లో పట్టు ఉందో చూసి పోస్టింగులు ఇస్తారు. ఇప్పుడు అమ్రపాలి విషయంలోనూ అలాగే అసెస్మెంట్ చేసి పోస్టింగ్ ఖరారు చేయనున్నారు.
అటూ ఇటూ మారిపోయిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లలో ఎవరెవరికి పోస్టింగ్ ఇస్తారు.. ఎవరెవరికి ఇవ్వరు అన్నదానిపై ఎలాంటి చర్చలు లేవు. ఒక్క కాట అమ్రపాలి విషయంలో మాత్రమే సోషల్ మీడియా ఆసక్తి చూపిస్తోంది. గతంలో తెలంగాణ క్యాడర్ లో ఉండే ఐఏఎస్ శ్రీలక్ష్మి .. రెండేళ్ల పాటు లాబీయింగ్ చేసుకుని ఏపీకి వచ్చారు. ఇప్పుడు ఆమెకు పోస్టింగ్ లేదు. కానీ ఆమె గురించి పట్టించుకునేవారు లేరు.