హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి వెళ్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చడం, ఈ అంశంలో ముఖ్యమంత్రి స్పందించిన తీరుతెన్నులు, ఉద్యోగుల పట్ల ఆయన వైఖరిపై చాలా విమర్శలున్నాయి. ఉప ఎన్నిక ముందు పెట్టుకుని ఆర్టీసీ సమ్మెను ఈ స్థాయికి వచ్చే వరకూ కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు అనేదే ఇప్పుడు ప్రశ్న? ఆయన దగ్గర ఏదో మాస్టర్ ప్లాన్ ఉందనీ, ప్రచార సభలో దాన్ని బయటపెడతారనీ, దీంతో నియోజక వర్గంలో తమ ప్రచార సరళి ఊపందుకుంటుందని తెరాస వర్గాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ సమ్మె అంశాన్ని హుజూర్ నగర్లో బాగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం! బుధవారం నాడు ఆర్టీసీ జేయేసీ నేతలతో ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు. ప్రభుత్వం, కార్మికులు ఒక అడుగు దిగి రావాలనే కోర్టు ఆదేశాలపై ప్రధానంగా చర్చించారు. కార్మికులకు సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రతిపక్షాల నాయకులు తెలియజేశారు. నిరసనలు మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు, ముఖ్యమంత్రి హుజూర్ నగర్ సభలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కేసీఆర్ ని హుజూర్ నగర్లో నిలదీయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది! ఆర్టీసీ సమ్మె తీవ్రతరమౌతున్నా ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడంపై తీవ్రంగా స్పందించాలనీ, దీనికి సంబంధించిన కార్యాచరణపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం.
దీంతో హుజూర్ నగర్లో సీఎం సభ ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పాలి. అయితే, కేవలం నియోజక వర్గం అభివృద్ధి గురించి, గడచిన ఆరేళ్లుగా తెరాస సర్కారు పాలన విజయాల గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడి, సమ్మె గురించి ప్రస్థావించకపోతే అది ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశం అవుతుంది. ఈ విషయం కేసీఆర్ అంచనాకి అందనిదైతే కాదు. అలాగని, త్వరలో చేస్తాం చూస్తామంటూ ఇంకా వాయిదా ధోరణిలో ఏదో ఒక ప్రకటన చేసి, ఎన్నికలు దాటేద్దామనుకున్నా… ఆ తరహా వ్యూహం తెరాసకు లాభించే వాతావరణం ఇప్పుడు లేదు. హుజూర్ నగర్లో స్పష్టమైన ప్రకటన ఏదో ఒకటి సీఎం చెయ్యాల్సిన ఒత్తిడి కనిపిస్తోంది. మరి, కేసీఆర్ వ్యూహం ఎలా ఉందో ఏంటో సభలో బయటపడుతుంది.