రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద రూ. ఐదువందల నోట్ల కట్టలు సెక్యూరిటీకి లభించిన ఘటన కలకలం రేపుతోంది. ఆ డబ్బులు తనవి కావని ఎంపీ సింఘ్వి స్పష్టం చేశారు. ఆ డబ్బులు తమవి అని ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా ముందుకు రాలేదు. దాంతో రాజ్యసభ చైర్మన్ ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. అభిషేక్ మను సింగ్వి సీటు దగ్గర దొరికిన డబ్బుల విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
గురువారం రొటీన్ సెక్యూరిటీ చెకప్ చేస్తున్న సమయంలో సింఘ్వి సీటు వద్ద డబ్బు కట్టలను గుర్తించి రాజ్యసభ చైర్మన్ కు సమాచారం ఇచ్చారు. ఈ అంశంపై అంతర్గతంగా వివరాలు సేకరించినప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేదు.దాంతో విచారణకు ఆదేశించారు . అయితే రాజ్యసభ చైర్మన్ సింఘ్వీ సీటుదగ్గర దొరికిన డబ్బులు అని చెప్పడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరివో తెలియనప్పుడుఆయన పేరు ఎలా ప్రస్తావిస్తారని మండిపడింది.
ఈ అంశంపై అభిషేక్ సింఘ్వి కూడా స్పందించారు. ఈ డబ్బుల అంశంపై తనకు ఏ మాత్రం తెలియదని స్పష్టం చేశారు. గురువారం నుంచి తాను పార్లమెంట్ కు వచ్చినా సీటులో కూర్చోలేదని క్యాంటిన్ లో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో మాట్లాడుతూ ఉన్నానని తర్వాత వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ డబ్బు వ్యవహారంలో విచారణ చేసి ఏం తేలుస్తారో కానీ.. ఆ డబ్బులు ఖచ్చితంగా ఎవరో ఎంపీలవే అయి ఉంటాయి.. కానీ వారు తమకు తెలియదని ఎందుకు చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. ఏదో డీల్ పార్లమెంట్ లో చేసుకున్నారేమోనన్న అనుమానాలు సామాన్యులకు కలగడం సహజమే.