custody- movie review
రేటింగ్: 2/5
ప్రతి దర్శకుడికీ ఓ ముద్ర ఉంటుంది. ఇంగ్లీష్‌లో స్టైల్ అంటారు. అదే… తన బలం. దురదృష్టం ఏమిటంటే అదే తన బలహీనత. వెంకట్ ప్రభుకీ ఓ బలం ఉంది. తన కథలన్నీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో సాగుతుంటాయి. కథల్లో గొప్పదనం ఏమీ ఉండదు. కానీ ఆ కథని చెప్పే విధానంలో మాత్రం తన స్టైల్ కనిపిస్తుంది. టైమ్ లూప్ జోనర్లో చాలా సినిమాలొచ్చాయి. అయితే… వాటిలో మాస్టర్ పీస్ గా నిలిచిన సినిమా.. `మానాడు`. దానికి కారణం…. వెంకట్ ప్రభు ఈ సినిమాలో అనుసరించిన స్క్రీన్ ప్లే విధానం. తను నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు అనగానే.. ఇందులో కూడా స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుందని అంతా ఆశిస్తారు. మరి కస్టడీలో ఆ వెంకట్ ప్రభు చేసిన కథన మాయాజాలం ఏమిటి? కనీసం ఈసారైనా అక్కినేని అభిమానులకు ఊరటనిచ్చే విజయం లభించిందా, లేదా? కస్టడీ ఎలా ఉంది?
శివ (నాగచైతన్య) కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు. తనకో ప్రేమ కథ ఉంది. చిననాటి స్నేహితురాలు రేవతి (కృతి శెట్టి)ని ఇష్టపడతాడు. కానీ రేవతి ఇంట్లో మరో పెళ్లి సెట్ చేస్తారు. తెల్లారితే ముహూర్తం. ఎలాగైనా సరే.. రేవతి పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తున్న శివకి దార్లో ఊహించని ఘటన ఎదురవుతుంది. ఓ కేసులో రాజు (అరవింద్ స్వామి)ని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొస్తాడు. అతనొక పెద్ద క్రిమినల్ అని తరవాత తెలుస్తుంది. పోలీస్‌స్టేషన్‌లోనే రాజుని చంపేయాలని ఓ ముఠా రంగంలోకి దిగుతుంది. వారి నుంచి రాజుని తప్పించి సీబీఐ కోర్టులో హాజరు పరిచే బాధ్యత శివపై పడుతుంది. ఓ సాధారణ కానిస్టేబుల్.. ఈ పని ఎలా చేయగలిగాడు? ఈ దారిలో తనకెదురైన ఆటంకాలు ఎలాంటివి? అనేది మిగిలిన కథ.
వెంకట్ ప్రభు సినిమాల్లో గొప్ప కథలుండవు. కానీ తన స్క్రీన్ ప్లే మాయాజాలాన్ని చూపించడానికి తగిన సెటప్ మాత్రం చేసుకొంటాడు. అలాంటి సెటప్ ఈ కథలోనూ ఉంది. ఓ భయంకరమైన క్రిమినల్ ఓ సాధారణమైన కానిస్టేబుల్ కస్టడీకి వస్తే.. తనని రక్షించుకొంటూ, సీబీఐ కోర్టుకి ఎలా హాజరుపరిచాడన్న సింపుల్ లైన్‌ని వెంకట్ ప్రభు తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చెప్పాలనుకొన్నాడు. అయితే… ఈ కథలో సెటప్ మినహాయిస్తే… కథనంలో మాయాజాలం మాత్రం మిస్సయ్యింది. బాంబు బ్లాస్టు సీన్ తరవాత.. కథ నేరుగా.. లవ్ స్టోరీలోకి వెళ్లిపోతుంది. అంతకు ముందు.. హీరో నిజాయితీని ఓ రొటీన్ సీన్ తో పరిచయం చేసి, వెంటనే పాటేసుకొన్నాడు దర్శకుడు. రేవతితో లవ్ స్టోరీ అత్యంత సాదాసీదాగా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. నిజానికి ఇలాంటి కథల్లో లవ్ ట్రాకులకూ, పాటలకూ చోటు ఇవ్వకూడదు. కానీ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువగా, తప్పుగా అంచనా వేసిన తమిళ దర్శకుడు… పాటలూ, లవ్ ట్రాక్ అంటూ కాలయాపన చేశాడు. ఆ లవ్ ట్రాక్‌లో కొత్తదనం ఉంటే.. ప్రేక్షకులు క్షమించేద్దురు. కానీ.. కుల మత అడ్డుగోడలంటూ రొటీన్ సంఘర్షణ సృష్టించి ఇంకాస్త విసుగు తెప్పించాడు. అరవింద్ స్వామి ఎంటర్ అయినప్పటి నుంచీ.. కథ కాస్త దారిలో పడుతుంది. నిజానికి కథని ఈ పాయింట్ దగ్గరే మొదలెట్టాల్సింది. అలా చేయాలంటే.. స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేయాలి. రాజు పాత్రని పరిచయం చేసే సన్నివేశాలు బాగుండాలి. లవ్ స్టోరీపై పెట్టిన శ్రద్ధ వాటిపై పెడితే ఫలితం మరోలా ఉండేది.
రాజుని పోలీస్ స్టేషన్లోకి తీసుకురావడం, అక్కడ ఓ ముఠా రాజుని హతమార్చడానికి ప్రయత్నించడం, అక్కడి నుంచి రాజుని కానిస్టేబుల్ తప్పించే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ ఆసక్తి కలిగిస్తాయి. కనీసం ఇక్కడి నుంచైనా కథ ప్రాధమిక సూత్రాలకు అనుగుణంగా సాగితే బాగుండేది. హీరో పక్కన హీరోయిన్ లేకపోతే గ్లామర్ దెబ్బతింటుందని దర్శకుడు భావించి ఉంటాడు. రేవతి పాత్రని సైతం.. మార్చురీ వ్యాన్ ఎక్కించేశాడు. ఓ పాత్రని అనవసరంగా కథలోకి ఇరికించాలని చూడడం వల్ల కథనానికి ఎంత ఇబ్బందో చెప్పడానికి ఈ సినిమానే పెద్ద ఉదాహరణ. హీరోయిన్ ఉంది రేవతి పాత్ర కథతో పాటు ట్రావెల్ చేయడం వల్ల వచ్చిన ప్రయోజనాల కంటే… ప్రతికూల అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి.
సెకండాఫ్ అంతా.. హీరో.. విలన్ని రక్షించే ప్రయత్నమే. దాంతో క్లైమాక్స్ ఏమిటన్నది ముందే తేలిపోతుంది. ఇంతా చేసి.. విలన్ని రక్షించాడా అంటే.. అదీ లేదు. చివర్లో ఓ వీడియో సందేశంతో.. హీరో తన లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు. ఇంతా చేసి, ఆఖరికి తండ్రిని కూడా త్యాగం చేసిన హీరో లక్ష్యానికి దూరంగానే ఆగిపోయాడేమో అనిపిస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు చేయడానికి ఏం లేకుండా పోయింది. అందుకే అక్కడో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా సాదాసీదాగా సాగిపోయింది. జీవా లాంటి నటుడ్ని పెట్టుకొని కూడా సరైన రీతిలో ఎమోషన్ పండించలేకపోయారు. ఈ కథని.. పర్సనల్ రివైంజ్ డ్రామాగా మార్చాల్సిన అవసరం కూడా లేదు. పైగా.. రాజు పాత్రని నెగిటీవ్ కోణంలోంచి, పాజిటీవ్ కోణంలో మారడం వల్ల కథకు వచ్చిన కొత్త లుక్ లేదు. ఆ పాత్రని భయంకరంగానే చూపించాల్సింది. ఈ కథలోకి సడన్ గా వచ్చి పడిన రాంకీ పాత్ర కూడా ఫన్నీగా మారిపోయింది. ఆయన ఓ సీన్లో అర్థాంరంగా వచ్చి బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. ఇదంతా ఖైదీ సినిమా వలం్ల వచ్చిన సైడ్ ఎఫైక్ట్స్ అనుకోవాలి.
అయితే అక్కడక్కడ కొన్ని ఛమక్కులు మాత్రం కనిపిస్తాయి. ఇది రెండు భాషల్లో తీసిన సినిమా. తమిళ వెర్షన్ నటులు వేరు, తెలుగు వెర్షన్ నటులు వేరు. తెలుగులో వెన్నెల కిషోర్ చేసిన పాత్రని తమిళంలో ప్రేమ్ జీ చేశారు. అయితే వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూపించి.. `తెలుగు వెర్షనా.. అయితే నువ్వు వెళ్లు..` అని ప్రేమ్ జీ. వెన్నెల కిషోర్‌తో చెప్పడం బాగుంది. 1989 … ఆ ప్రాంతంలో సాగే సినిమా ఇది. అయినా సరే.. వారియర్లో ఓ పాటని పాడుకొంటూ.. `ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉందే` అని కృతి శెట్టి ఆలోచనలో పడడం కూడా ఫన్నీగానే ఉంది.
నాగచైతన్య తన వరకూ బాగానే చేశాడు. కష్టపడ్డాడు. దర్శకుడు ఏం చెబితే అది గుడ్డిగా ఫాలో అయ్యాడు. ఓ హిట్ దర్శకుడ్ని నమ్మడంలో తప్పు లేదు. కానీ సరైన ప్రతిఫలం మాత్రం అందలేదు. కృతి శెట్టి ని చూస్తే ఉప్పెనలోని గ్లామర్ అంతా ఎక్కడికిపోయిందో అనిపిస్తుంది. రాజు గా.. అరవింద్ స్వామి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకొంటుంది. అయితే ఆ పాత్రని డిజైన్ చేసిన విధానమే సరిగా లేదు. శరత్ కుమార్ ఓకే. ప్రియమణి పాత్రకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. వంటలక్క.. ఈ సినిమాలో స్పెషలాఫ్ ఎట్రాక్షన్.
ఇళయరాజా, యువన్ శంకర్ రాజా.. వీరిద్దరూ ఉన్నా, పాటల్లో, నేపథ్య సంగీతంలో మెరుపులు లేవు. 1890 నేపథ్యం ఎంచుకోవడం వల్ల.. ఈ కథకు కొత్తగా ఒరిగిందేం లేదు. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఫైట్ బాగుంది. సింగిల్ షాట్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు. ఓ సాధారణమైన కథని, అంతే సాధారణంగా చూపించి.. మమ.. అనిపించాడు. మొన్నటికి మొన్న అఖిల్ ఇచ్చిన డిజాస్టర్ తో ఇబ్బంది పడిన అక్కినేని ఫ్యాన్స్‌కి.. ఈసారి చైతూ కూడా ఊరట ఇవ్వలేకపోయాడు.
ఫినిషింగ్ టచ్: ప్రేక్షకులే అరెస్ట్!