రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే అందుకు విరుద్దంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కిసాన్ సమ్మాన్ కోతలకు గురి అవుతోంది. ఈ పథకానికి అనేక కొర్రీలు పెడుతూ లబ్దిదారుల సంఖ్యను నానాటికీ కుదిస్తోంది.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి రైతుల మనస్సు దోచిన మోడీ రైతాంగ సంక్షేమాన్ని విస్మరించారని అందుకు బీజేపీ పదేళ్ల పాలన అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దేశంలో 70 శాతం మంది రైతుల ఆదాయం ఏటా 15వేలకు మించడం లేదని, కేవలం 30 శాతం రైతులు మాత్రమే 30 వేల ఆదాయం అర్జిస్తున్నారని అధ్యయనంలో తేలింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే రైతుల కోసం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ పథకానికి కొర్రీలు పెడుతూ లక్షాలాది మందిని అర్హుల జాబితాను నుంచి తొలగించారు.
కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా మూడు విడతల్లో ఏటా రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది కేంద్రం. అయితే, తెలంగాణలో రైతులందరికీ ఈ పథకం అందడం లేదు. దాదాపు 10 లక్షల మంది అర్హులైన రైతులకు సాయం నిలిపివేసింది. అదే సమయంలో కేంద్రం విధించిన కండిషన్లు రైతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కేవలం 2019 ఫిబ్రవరిలో ఎన్ రోల్ చేయించుకున్న వారికీ మాత్రమే ఈ పథకం ద్వారా సాయం అందటం పట్ల రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 2019 తర్వాత భూములు కొన్న రైతులకు సాయం అందకపోవడంతో ఈ పథకంపై కొంతమందికేనా అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
ఈ పథకం కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తింపజేస్తోంది కేంద్రం. అలాగే, తల్లిదండ్రులు చనిపోతే వారి వారసుల పేరిట భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా పీఎం కిసాన్ సమ్మాన్ సాయం అందటం లేదు. కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారికి ఈ పథకం కింద సాయం పొందేందుకు ఏటా ఒకసారి అవకాశం ఇవ్వాల్సిన ఇప్పటికీ కేంద్రం వాటిని పట్టించుకోవడం లేదు. కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది అర్హులకు ఈ సాయం అందటం లేదని తెలుస్తోంది.