సంధ్యా ధియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో అన్ని వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఏ వ్యవస్థ వల్ల తప్పు జరిగిందన్న వాదనలు జరుగుతూనే ఉన్నా తప్పు జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరగాలి ?. తప్పు చేసిన వారిని శిక్షించాలి.. మరోసారి అలాంటివి జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ జరుగుతోంది వేరు. ఫలితంగా పోలీసులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు.
ఎప్పుడూ కూల్ గా ఉండే కమిషనర్ సీవీ ఆనంద్ కూడా తన కోపం తెచ్చుకున్నారు. నేషనల్ మీడియాను అమ్ముడుపోయారని మండిపడ్డారు. ఆయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ఊహించలేకపోయారు. దీనికి కారణం నేషనల్ మీడియా పోలీసుల వాదనను ప్రజలకు చూపించకపోవడమే అని అంటున్నారు. కారణం ఏదైనా ఆయన మీడియాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాంతో ఆయన క్షమాపణ చెప్పాలి వచ్చింది.
కమిషనర్ సీవీ ఆనంద్ కేసులన్నింటినీ ఒకేలా చూస్తారు. సెలబ్రిటీ కేసు..మామూలు కేసు అన్నది కాదు. తప్పు చేసిన వారిని బయటకు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తారు. ఏ కేసు విషయంలోనూ ఆయన ఒత్తిడికి గురయినట్లుగా ఇప్పటి వరకూ ఎవరూ చెప్పుకోరు. కానీ మొదటి సారి పోలీసులపై నింద పడుతూంటే.. తమ వాదన ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయంతో ఆయన జాతీయ మీడియాపై నోరు జారారు. కానీ వెంటనే దిద్దుకున్నారు.