హైదరాబాద్ కొత్త కమిషనర్ సీవీ ఆనంద్ ట్యాపింగ్ కేసుపై దృష్టి సారించారు. సీవీ ఆనంద్ దృష్టి పెడితే అందులో ఏ టు జడ్ అంశాలు బయటకు రావాల్సిందే. బాధ్యతలు చేపట్టిన తర్వాత వినాయక నిమజ్జనం వంటివి ఉండటంతో ఇప్పటికే దర్యాప్తులో ఉన్న వాటిపై సమీక్ష చేయలేదు. ఇప్పుడు హై ప్రోఫైల్ కేసులపై ఆయన దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికలకు ముందు.. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని నాలుగున్నర వేల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తేలింది. అరెస్టు అయిన పోలీసు అధికారులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు పరారీలో ఉండటంతో వీరికి బెయిల్ కూడా రావడం లేదు. ఆరు నెలల వీసాపై వెళ్లి అక్కడ ఏదో చేసి వీసాను పెంచుకుంటున్నారు కానీ అమెరికా నుంచి రావడం లేదు. దీంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ శ్రవణ్ రావు కూడా పరారీలోనే ఉన్నారు. ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు.
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కోసం ఏకంగా నాలుగున్నర వేల మంది పోన్లు ట్యప్ చేశారు. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబీకులతో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ జరిపి, వారి కదలికలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ఇచ్చేవారు. ఇవన్నీ ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో ఉన్నాయి. ధ్వంసం చేసిన సమాచారాన్ని రికవరీ చేయడంలో పోలీసులు విజయవంతం అయినట్లుగా చెబుతున్నారు.
సీవీ ఆనంద్ ఈ కేసును సమీక్షించి.. దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తే ముందు ముందు మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమన అనుకోవచ్చు.