తెలంగాణ తరపున మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బరిలోకి దిగిన సీవీఎల్ నరసింహారావు హఠాత్తుగా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆయన ఉదయమే మేనిఫెస్టో కూడా ప్రకటించారు. దీంతో ముగ్గురు అభ్యర్థులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ మధ్యాహ్నానానికి మాట మార్చేశారు. నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించారు. అయితే తాను ఎవరికీ మద్దతివ్వబోనని… అన్ని విషయాలను రెండు రోజుల్లో చెబుతానని మీడియాకు సమాచారం ఇచ్చారు.
సీవీఎల్ నరసింహారావు ఎందుకు బరిలో తప్పుకున్నారో తెలియదు కానీ.. రెండు ప్యానళ్ల మధ్యే పోటీ ఉండేలా చూడటానికి కొంత మంది సినీ పెద్దలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బండ్ల గణేష్తో కూడా నామినేషన్ను ఉపసంహరింప చేసినట్లుగా భావిస్తున్నారు. పెద్దల సలహా మేరకు ఉపసంహరించుకున్నానని బండ్ల గణేష్ కూడా చెప్పారు.
సీవీఎల్ బరిలో ఉంటే కొన్ని ఓట్లయినా చీలుతాయని అంచనా వేశారు. ఇప్పుడు ఆయన కూడా వైదొలగడంతో రెండు ప్యానళ్ల మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది. అధ్యక్ష పదవి కోసం మొదట్లో జీవిత, హేమ కూడా పోటీ పడ్డారు. వారు కూడా వేరే ప్యానళ్లలో చేరిపోయారు.