తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి .. హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకునేందుకు మరో గొప్ప చాన్స్ లభించింది. హైదరాబాద్లో సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించడంతో ఆయన భారీ ఎత్తున సక్సెస్ చేసి.. తన సత్తా చూపించాలని అనుకుంటున్నారు. సీడబ్ల్యూసీ భేటీ హైదరాబాద్ లో అని ప్రకటించగానే…. ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తాజ్ కృష్ణాను వేదికగా ఖరారు చేశారు . రెండు రోజుల పాటు సమావేశాలను ఏ లోటు రానీయకుండా నిర్వహిస్తారు.
ఇక పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభనూ ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ సమయం ఉన్నా.. ప్రజల్ని మొబిలైజ్ చేసి… భారీ సభల్ని నిర్వహించడంలో రేవంత్ రెడ్డి ప్లానింగ్ వేరుగా ఉంటుంది. ఇప్పటికి రెండు వారాల వరకూ సమయం ఉంది కాబట్టి ఆయన ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని ఆయన చెబుతున్నారు. అయితే పరేడ్ గ్రౌండ్స్ సామర్థ్యం అందులో సగం కూడా ఉండదు.
ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ మాటే చెల్లుబాటు అవుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నా.. చివరికి హైకమాండ్ దగ్గర ఓకే చేయించుకుని వచ్చేది రేవంత్ రెడ్డేనని… అంతిమంగా ఆయన చాయిస్ కే ప్రాధాన్యత లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. హైకమాండ్ వద్ద ఉన్న తన పలుకుబడిని పెంచుకునేందుకు రేవంత్ కు సీడబ్ల్యూసీ మీటింగ్ మరో అవకాశాన్ని కల్పిస్తోంది.