పొట్టు నింపుకోవడానికి సైకిళ్లకు పంచర్లు వేసుకునేవారు ఎంత సంపాదిస్తారు..?. ఇరవై ఏళ్ల పాటు పంచర్లేసినా.. ఓ ఇల్లు కొనుక్కోవడం కూడా సాధ్యం కాదు. కానీ తిరుపతికి చెందిన పల్లెవీధి రమేష్ అనే వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు సంపాదించాడు. ఆదాయానికి, కడుతున్న పన్నుని, రమేష్ పేరు మీద ఉన్న ఆస్తులకు చాలా.. చాలా తేడా కనిపిస్తూండటంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. దీంతో అసలు గుట్టు బయటపడింది. సైకిళ్లకు పంచర్లు వేయడంతో ప్రారంభించి.. వడ్డీల పేరుతో మనుషులకూ పంచర్లు వేయడం నేర్చుకోవడంతో.. ఆస్తి కొండలా పెరిగిపోయింది.
రమేశ్ ఇళ్లల్లో సోదాలు చేయడానికి ఐటీ అధికారులకు రెండు రోజులు పట్టింది. ఈ దాడుల్లో లభించిన ఆస్తుల చిట్టాను చూసి ఆదాయపుపన్ను శాఖ అధికారులే విస్తుపోయారు. రుణాలు పొందిన పత్రాలు, తనఖా పత్రాలు, ప్రామిసరీ నోట్లు వందలాదిగా ఇంట్లో బయటపడ్డాయి. వీటితోపాటు పెద్ద మొత్తంలో బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ప్రధాన కూడలిలోని అయిదు అంతస్తుల భవనం, కోర్టు సముదాయాల పక్కనే నాలుగు అంతస్తుల భవనం, దాని పక్కనే నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కూడా రమేష్‌దే. రమేష్ ఆస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్ల పైమాటే. ఇంకా పన్ను మినహాయింపు ఆస్తులను, ఇతరత్రా వాటి విలువను కూడా లెక్కించే పనిలో అధికారులు ఉన్నారు.
రోజువారీ వడ్డీలకు… చిరు వ్యాపారుల దగ్గర్నుంచి.. రాజకీయ నేతల వరకూ.. అందరికీ రమేష్ తన వడ్డీ దెబ్బ రుచి చూపించాడు. అవసరాన్ని బట్టి పది రూపాయలు, అంతకంటే ఎక్కువ వడ్డీకి కూడా లక్షలకు లక్షలు అప్పులు ఇచ్చేవాడు. అనుకున్న సమయానికి రుణం చెల్లించకపోతే అప్పుతీసుకునే దాడులకు తెగబడేవాడు. కొన్నాళ్ల క్రితం.. కరీంనగర్ జిల్లాలో మోహన్ రెడ్డి అనే పోలీసు అధికారి ఇలా వడ్డీ వ్యాపారంతో అందర్నీ బెదిరించి… కొంత మంది ఆత్మహత్యలకు కారణమయ్యాడు. ఆ తరహాలో ఆత్మహత్యలు వెలుగుచూడకపోయినా… రమేష్ వడ్డీ వేధింపులను భరించలేక చాలా మంది ఊరు వదిలి వెళ్లిపోయారు