తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఆ పదవి కోసం చాలామంది సీనియర్లు పోటీ పడుతున్నారు. పీసీసీ కుర్చీలో కూర్చోబెడితే పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా అభిప్రాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక, కొందరు సీనియర్ నేతలైతే ఢిల్లీకి వెళ్లి, ఎవరి స్థాయి ప్రయత్నాలు వారు చేసుకొచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కుంతియా బాధ్యతలు చేపట్టాక, పీసీసీలో మార్పులు ఉండవనే సంకేతాలు ఇవ్వడంతో నేతలు కొంత సైలెంట్ అయిపోయారు. ఈ చర్చ కాస్త పక్కకు వెళ్లినట్టయింది. అయితే, ఇప్పుడీ చర్చ మళ్లీ తెరమీదికి వస్తోంది. రాహుల్ గాంధీకి త్వరలోనే పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయం. ఆ వెంటనే టీపీసీసీలో మార్పులు ఉంటాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైందని కథనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఒక మహిళా నేతలకు టీపీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు! మాజీ మంత్రి డీకే అరుణ పేరు ఈ సందర్భంగా తెరమీదికి వచ్చింది. నిజానికి, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించాలని గతంలో ఆమె కూడా అధిష్టానాన్ని కోరారు.
అయితే, మహిళా నేతకే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మంచిదనే ఈ చర్చ తెర మీదికి రావడం వెనక కాంగ్రెస్ వ్యూహం వేరేగా ఉందని తెలుస్తోంది! తెరాస మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత దక్కలేదు. కేసీఆర్ సర్కారు హయాంలో మహిళలా ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత లేదనే విమర్శ కూడా ఎప్పట్నుంచో ఉన్నదే. సో… డీకే అరుణకు పదవి ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పుకున్నట్టూ అవుతుందనీ, ఈ కోణం నుంచి తెరాసపై విమర్శలు గుప్పించే ఆస్కారమూ ఉంటుందనేది హైకమాండ్ వ్యూహంగా చెబుతున్నారు. దీన్నో ప్రచారాస్త్రంగా మార్చుకోవచ్చు అనేది హైకమాండ్ ఆలోచనగా కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే పీసీసీ రేసులో జానా రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి ఉన్నారు. డీకే అరుణ కంటే కాస్త తీవ్రంగానే వారి ప్రయత్నాల్లో వారూ ఉన్నారు. అయితే, ఇదే అంశమై డీకే అరుణ కూడా ఇటీవలే రాహుల్ గాంధీతో చర్చించారనే కథనాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. హైకమాండ్ ఆలోచన ఎలా ఉన్నా… తన వంతు ప్రయత్నాల్లో ఆమె కూడా తీవ్రంగా చేస్తున్నారట! ఇప్పుడీ ‘మహిళా నేతలకు ప్రాధాన్యత’ అనే చర్చ తెర మీదికి రావడంతో, ఆమె ప్రయత్నాలకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగూ అరుణకు ఫైర్ బ్రాండ్ నేతగా కొంత ఇమేజ్ ఉంది. మహిళకు ప్రాధాన్యత ఇస్తే పార్టీకి కలిసొచ్చే మరో అంశం అవుతుంది. కాబట్టి, పీసీసీ పగ్గాలు ఆమెకు దక్కేందుకే ఎక్కువ అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.