సీక్వెల్, ప్రీక్వెల్ సంస్కృతేం కొత్త కాదు. దాదాపుగా హిట్టయిన ప్రతీ సినిమాకీ సీక్వెల్ చేయాలన్న ఆలోచన దర్శక నిర్మాతలకు ఉంటుంది. ప్రస్తుతం మరో సీక్వెల్ పట్టాలెక్కుతోంది. అదే… డీ అండ్ డీ. మంచు విష్ణు – శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన `ఢీ`కి సీక్వెల్ ఇది. త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఢీ సీక్వెల్ అనగానే.. కొన్ని ప్రశ్నలు ఉద్భవించాయి. శ్రీహరి పాత్ర ఎవరు పోషిస్తారు? జయ ప్రకాష్ రెడ్డిగా ఎవరు కనిపిస్తారు? వాళ్లకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అని ఆరా తీశారు.
అయితే.. ఢీ కథకూ.. దీనికీ సంబంధం లేదట. ఇది వేరే జోనర్. ఢీ కథకి ఇది కొనసాగింపు కాదని.. మంచు విష్ణు తేల్చేశాడు. సో.. శ్రీహరి, జయ ప్రకాష్ రెడ్డి పాత్రలు ఇందులో వాడాల్సిన అవసరం లేదన్నమాట. కాకపోతే.. ఢీ మంచి ఎంటర్టైనర్. అందులో బ్రహ్మానందం పాత్ర చాలా కీలకం. `నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారూ` అంటూ బ్రహ్మానందం పంచిన కామెడీ ట్రేడ్ మార్క్ అయిపోయింది. అలాంటి పాత్రలు, అంతటి వినోదం లేకపోతే.. ఈ సీక్వెల్ వర్కవుట్ అవ్వడం కష్టం. మరి శ్రీనువైట్ల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..?