తెలంగాణలో వ్యక్తిగత స్వేచ్చ ప్రమాదంలో పడిందా..? పార్టీలకు అతీతంగా నేతలందరి…ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా..? అంటే.. అవననే సమాధానాలు గట్టిగానే వస్తున్నాయి. విపక్ష నేతలు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. కానీ తమ మాటలు అన్నీ ఎప్పటికప్పుడు రికార్డయి చేరాల్సిన వారికి చేరుతున్నాయని.. తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి వారు అంచనా వేసుకుంటున్నారు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఒక వైపు గగ్గోలు పెడుతోంటే మరోవైపు గులాబీ పార్టీ నేతల్లోనూ అదే గుబులు రేపుతోంది. ఫోన్లలో మాట్లాడాలంటే గులాబీ నేతలు భయపడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కు అవకాశం ఉండదని కొంత కాలం నుంచి ఇంటర్నెట్, వాట్సప్ కాల్స్ లో మాట్లాడుకుంటున్నారు. కానీ తెలంగాణ నిఘా విభాగం అధికారులు వాట్సాప్ కాల్స్ ను కూడా ట్యాపింగ్, ట్రాకింగ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నారు. దీని కోసం ఏకంగా రూ. 70కోట్లు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. తమ కోసం….తమ వారసుల కోసం ఇతర పార్టీల నేతలతో ఏ విషయం మాట్లాడినా అధినేతకు తెలిసిపోతోందనే భయం వారిని వెంటాడుతోంది. డీఎస్ కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుకుంటున్న ట్యాపింగ్ ద్వారానే తెలిసిందని… టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అలాగే హరీష్ రావును దూరం పెట్టడానికి కూడా కారణం.. ఇదేనంటున్నారు.
ఫోన్లు డైరైక్టుగా మాట్లాడితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన అధికార పార్టీ నేతలు….టెక్నాలజీ వైపు మళ్లారు. ఇటీవలి కాలంలోవాట్సాప్ కాల్స్ మాత్రమే చేస్తున్నారు. కానీ దాన్ని కూడా ట్రాక్ చేస్తున్నట్లు తేలడంతో.. అసలు ఫోన్స్ వచ్చినా పొడి పొడి సమాధానాలకే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే.. నేతలంతా ఫోన్లు మాట్లాడాలంటే జంకుతున్నారు. ఏదైనా డైరెక్ట్ కలిసి మాట్లాడాదామంటూ అనుచరులకు చెబుతున్నారు. మొత్తానికి.. ట్యాపింగ్‌కు తన మన తేడా లేదని తెలంగాణ సర్కార్ నిరూపిస్తోందన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.