ఉన్న పార్టీలో ఉండలేక, వదులుకున్న పార్టీలోకి వెళ్లలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన మరోసారి పూర్తి మౌనముద్ర దాల్చారు. ఆయన్ని తెరాస కూడా పక్కనపెట్టినట్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి మాట్లాడతాననీ డీఎస్ చెప్పినా… ఇంతవరకూ సీఎం అపాయింట్మెంట్ ఆయనకి దక్కలేదు. డీఎస్ విషయమై ఏదో కొటి తేల్చేద్దామన్న ఆసక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చూపడం లేదు. ఇక, స్థానికంగా చూసుకుంటే… పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకూ ఎంపీ కవిత అనుమతి లేనిదే ఆయన్ని ఎవ్వరూ పిలవడం లేదు! దీంతో సొంత ఇలాఖాలోనే ఏకాకి అయిన పరిస్థితి. పోనీ, సొంతగూటికి వెళ్లిపోదామన్నా అక్కడ పరిస్థితి మరోలా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డీఎస్ సంసిద్ధంగా ఉన్నారంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ, కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్న మాటేంటే… ఆయన్నెలా చేర్చుకుంటాం అని! ఆయన కుమారుడు భాజపాలో ఉండగా, ఈయన్ని చేర్చుకుంటే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని నేతలు అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ ఆయన్ని చేర్చుకోవాలంటే తమ కమిటీ అనుమతి ఉండి తీరాలంటూ వీ హన్మంతరావు అంటున్నారట! మరో నేత మధు యాష్కీ అయితే డీఎస్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో డీఎస్ మంతనాలు సాగించారన్నది నిజం కాదనీ, ఇప్పటివరకూ ఆయన ఎవ్వరితోనూ సంప్రదించలేదని యాష్కీ అంటున్నారు.
నిజానికి, ఒక దశలో డీఎస్ కుమారుడు అర్వింద్ ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ, తాను మోడీ భక్తుడనంటూ భీష్మించేసరికి ఆ ప్రయత్నాలు వదులుకోవాల్సి వచ్చింది. నిజామాబాద్ లోక్ సభ నియోజక వర్గంలో అర్వింద్ పట్టు పెరిగింది. కాబట్టి, ఇప్పటికిప్పుడు డీఎస్ ను కాంగ్రెస్ లోకి పిలిచి పీటేసినంత మాత్రాన పార్టీకి ఏరకంగానూ ఉపయోగపడే పరిస్థితి లేదన్న విశ్లేషణలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో డీఎస్ కాంగ్రెస్ వైపునకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలు కూడా కనుమరుగౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెరాసలో ఎలాగూ ఉండలేని పరిస్థితి ఉంది. ఆయన కాంగ్రెస్ వైపు వస్తే అడ్డుకునేవారే ఎక్కువ. కాబట్టి, చుట్టూ తిరిగి ఆయన కూడా కుమారుడి బాటలోనే భాజపా వైపు వెళ్తారా అనే చర్చ ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. ఏదేమైనా, డీఎస్ రాజకీయ భవిష్యత్తుని నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది.