తెరాసతో విభేదించి, పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరుకుంటారనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్నదే. అయితే, అధికారికంగా ఇంకా ఆ ప్రకటన అటు డీఎస్ నుంచిగానీ, కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కూడా రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో డీఎస్ కూడా వీలైనంత తొందరగానే పార్టీలో చేరేందుకు పావులు కదుపుతూ వస్తున్నారు. ఈ మధ్యనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి వెళ్తూ వెళ్తూ… డీఎస్ ఇంట్లో కాసేపు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో కూడా డీఎస్ చేరకకు సంబంధించి సానుకూల చర్చే జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇక, డీఎస్ చేరిక ముహూర్తం విషయానికొస్తే… అక్టోబర్ 11 నుంచి 16వ తేదీలోగా… ఏదో ఒక రోజు డీఎస్ చేరిక అధికారికంగా ఉంటుందని తెలుస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా ఆ వారం రోజుల్లోనే ఒక ముహూర్తం ఉంటుందనీ, అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సమాచారం. ఈ వారంలో ఏదో ఒక రోజు రాహుల్ సమయం ఇస్తారనీ, అంతకంటే ఒకరోజు ముందే సోనియా గాంధీని కలిసేందుకు డీఎస్ వెళ్తారని ఏఐసీసీ వర్గాలే ఇప్పుడు అంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఒక సీనియర్ ఏఐసీసీ నేత ఆఫ్ ద రికార్డ్ మీడియా మిత్రులతో ముచ్చటించారట. డీఎస్ చేరికకు సంబంధించిన అప్ డేట్స్ ఏంటనీ, ఎలాంటి ఒప్పందంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారని అడిగితే… డీఎస్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే డీఎస్… ఆయన కొత్తగా పార్టీలోకి వచ్చి చేరేదేం లేదనీ, ఆయన వస్తున్నది సొంత పార్టీలోకేనని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
సో.. కాంగ్రెస్ లో డీఎస్ చేరబోతున్నారు అనే కథనాలపై అధికారికంగా దాదాపు ఒక స్పష్టత వచ్చినట్టే భావించాలి. అయితే, ఎంత సొంత పార్టీ అని చెబుతున్నా… తెరాసలో డీఎస్ ఇమడలేకపోవడానికి కారణం కూడా తన డిమాండ్లకు ప్రాధాన్యత దక్కలేదన్నదీ ఒకటుంది కదా. కాంగ్రెస్ లోకి రావడానికి కూడా ఆయన రెండు షరతులు పెట్టారనే తెలుస్తోంది. తాను సూచించిన ఇద్దరికి ఎమ్మెల్యే టిక్కెట్లు, తనకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. అయితే, దీనిపై అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత ఇచ్చిందో ఇంకా తెలియాల్సి ఉంది.